సూరీ హత్యకేసులో భానుకిరణ్‌కు జీవితఖైదు

18 Dec, 2018 12:59 IST|Sakshi

భానుకు సహకరించిన మన్మోహన్‌కు 5 ఏళ్ల జైలు

మిగతా నలుగురు నిర్దోషులుగా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. సూరి హత్యకేసులో భానుకిరణ్‌ను దోషిగా తేలుస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భానుకు సహకరించిన మన్మోహన్‌కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా ఖరారు చేసింది. సూరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బయ్య, హరిబాబు, వంశీ, వెంకటరమణలను నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది.

2011, జనవరి 3న సూరి హత్య జరిగింది. సూరీ అతడి ప్రధాన అనుచరుడు భానుకిరణ్, డ్రైవర్‌ మధుమోహన్‌ జూబ్లీహిల్స్‌ నుంచి సనత్‌నగర్‌ వెళ్తుండగా యూసుఫ్‌గూడలోని నవోదయ కాలనీ సమీపంలో సూరిపై భానుకిరణ్‌ పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరిపి హతమార్చాడనే ఆరోపణలపై కోర్టు విచారించింది. డ్రైవర్‌ మధు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 8 ఏళ్లపాటు ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో కోర్టు 117 మంది సాక్షులను విచారించింది. భాను కిరణ్‌పై పోలీసులు మూడు చార్జి షీట్లు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు