ఠాణేల్లంకలో ఎన్‌ఐఏ విచారణ

20 Jan, 2019 04:08 IST|Sakshi
ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు

నిందితుడి కుటుంబ సభ్యులను విచారించిన అధికారులు

ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలపై ఆరా 

ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం కోసం ఎన్‌ఓసీకి దరఖాస్తు చేశాడా.. లేదా.. 

స్థానిక పోలీస్‌స్టేషన్‌ నుంచి లిఖిత పూర్వక వివరాలు కోరిన ఎన్‌ఐఏ అధికారులు

ముమ్మిడివరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేల్లంకలో రెండో రోజు శనివారం కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారణ నిర్వహించారు. గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ బృందం.. సీఐ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో మరో ముగ్గురు అధికారులు శుక్రవారం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను విచారించారు. రెండో రోజు శనివారం ఠాణేల్లంకలో వీఆర్వో భాస్కరరావు సమక్షంలో శ్రీనివాసరావుకు ఉత్తరం రాసిన సోదరి విజయదుర్గను, జగన్‌తో కలిసి ఉన్న ఫ్లెక్సీ వేయించిన శ్రీనివాసరావు స్నేహితుడు, విజయదుర్గ రాసిన ఉత్తరాల జిరాక్స్‌ కాపీలు తీసిన జిరాక్స్‌ సెంటర్‌ నిర్వాహకుడు జె.శివసుబ్రహ్మణ్యంను విచారించారు.

శ్రీనివాసరావు ప్రవర్తనపై గ్రామంలో పలువురు యువకులను విచారించారు. నిందితుడి తండ్రి తాతారావు, తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజులకు సంబంధించి ఆస్తి వివరాలు, బ్యాంకు అకౌంట్లు, ఇతర ఆర్థిక లావాదేవీలపై విచారణ చేశారు. నిందితుడిపై గతంలో ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు, ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగంలో చేరే సమయంలో ఎన్‌ఓసీ కోసం శ్రీనివాసరావు పోలీస్‌స్టేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడా.. లేదా.. తదితర వివరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పోలీసులను కోరినట్లు తెలిసింది. 

మీరైనా నిజాయితీతో విచారించి దోషులను పట్టుకోండి 
‘మీపై నమ్మకంతో వచ్చాం.. ఏం జరిగిందో మొత్తం చెబుతాం.. నిజాయితీతో విచారణ చేపట్టి దోషులను పట్టుకోండి. కుట్రదారులను, సూత్రధారులను బయటపెట్టండి’ అంటూ ఎన్‌ఐఏ అధికారులను వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. శనివారం మధ్యాహ్నం ఎన్‌ఐఏ బృందం ఎదుట వారు విచారణకు హాజరయ్యారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో వీవీఐపీ లాంజ్‌లో ఉన్న నేతలందరినీ సాక్షులుగా పేర్కొంటూ ఎన్‌ఐఏ నోటీసులిచ్చింది.
విచారణకు ముందు మళ్ల విజయప్రసాద్‌ నివాసంలో భేటీ అయిన వైఎస్సార్‌సీపీ నేతలు 

ఎన్‌ఐఏ తాత్కాలిక కార్యాలయంలో సరైన వసతులు లేనందున వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ నివాసంలో విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారమిచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలు విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారుల బృందం ఒక్కొక్కరితో కనీసం పావుగంట సేపు విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించింది. ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కరణం ధర్మశ్రీ, నేతలు మజ్జి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, కేకే రాజు, ఎ.సుధాకర్, జియ్యాని శ్రీధర్, కొండా రాజీవ్‌గాంధీ విచారణకు హాజరయ్యారు. ‘ఆ రోజు ఏం జరిగిందో వివరించాం.. ఎన్‌ఐఏ అధికారులైనా నిజాలు నిగ్గు తేలుస్తారని భావిస్తున్నాం’ అని నేతలు మీడియాతో చెప్పారు.  

మరిన్ని వార్తలు