ప్రభుత్వ భూమి ఆక్రమణ..నలుగురిపై కేసు నమోదు

13 Jun, 2018 12:01 IST|Sakshi
ప్రభుత్వ భూమి అని ఆక్రమిత భూమిలో బోర్డు పాతుతున్న వీఆర్వో, సిబ్బంది 

బెల్లంపల్లి ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి కన్నాలబస్తీ వ్యవసాయ మార్కెట్‌ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు కొందరు సిద్ధపడ్డ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.

గుట్టుచప్పుడు కాకుండా బుధాకలాన్‌ శివారు సర్వే నంబర్‌ 170లోని ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఆక్రమణదారులు వారం రోజుల నుంచి భూమిని చదును చేయిస్తున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ భూమిని పరిశీలించారు.

సదరు భూమి సర్వే నంబర్‌ 170 పీపీ అని నిర్ధారించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చదును చేయించడం సరికాదని, వెంటనే పనులను నిలిపి వేయాలని ఆక్రమణదారులను ఆదేశించారు. అయినా వారు వినలేదు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ కె.సురేశ్‌.. సబ్‌ కలెక్టర్‌ పీఎస్‌ రాహుల్‌రాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆయన సోమవారం ఘటనాస్థలికి వెళ్లి భూ ఆక్రమణను పరిశీలించారు. తక్షణమే నిలుపుదల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు పాతి పెట్టాలని, తమ ఆదేశాలను ఆక్రమణదారులు అతిక్రమిస్తే పోలీసు కేసు పెట్టాలని హుకూం జారీ చేశారు.

దీంతో ఆక్రమణదారులకు వీఆర్వో నచ్చచెప్పిన కబ్జా పనులు మానుకోలేదు. యథావిధిగా చదును చేయించే పనులు ముమ్మరం చేయడంతో మంగళవారం వీఆర్వో లక్ష్మయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమిత భూమివద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. సదరు ఆక్రమిత భూమిని వన్‌టౌన్‌ ఎస్సై ప్రేమ్‌ కుమార్, వీఆర్వోతో కలిసి సందర్శించారు.

నలుగురిపై కేసు నమోదు

ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన బెల్లంపల్లి మధునన్న నగర్‌కు చెందిన నలుగురిపై పోలీసు కేసు నమోరైంది. అక్రమంగా భూ ఆక్రమణకు పాల్పడిన దండెబోయిన భాస్కర్‌ రెడ్డి, నీలమ్మ, ఎండీ సలీమా, ధోని, రాజేశ్వరిపై తహసీల్దార్‌ కె.సురేశ్‌ ఆదేశాల మేరకు వీఆర్వో ఎస్‌.లక్ష్మయ్య వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో సదరు ఆక్రమణదారులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ ఎస్సై ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు