మనుమరాలిపై కిరాతకం

6 Jun, 2019 04:07 IST|Sakshi
హత్య వివరాలను వెల్లడిస్తున్న సీఐ సురేష్‌బాబు

మెడవిరిచేసి.. అపస్మారక స్థితిలో ఉన్న బాలికపై అత్యాచారం 

ఆపై చున్నీతో ఉరివేసి.. ఆత్మహత్యగా చిత్రీకరణ 

పోలీస్‌ విచారణలో బయటపడిన నిజాలు 

సున్నపుబట్టి హత్య కేసు వివరాలు వెల్లడించిన బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు 

బుచ్చిరెడ్డిపాళెం: బుసలుకొట్టిన కామం.. ఆ వృద్ధుడిని మానవ మృగంగా మార్చింది. వావివరసలు మరిచి వికృతంగా ప్రవర్తించేలా చేసింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన 16 ఏళ్ల మనుమరాలి (కూతురు బిడ్డ)పై ఆ వృద్ధుడు కన్నేశాడు... ఒంటరిగా ఉండడంతో అత్యాచారానికి యత్నించాడు... ఊహించని పరిణామంతో షాక్‌ తిన్న ఆ బాలిక ప్రతిఘటించింది. దీంతో అత్యంత హేయంగా మెడవిరిచేశాడు... అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేశాడు.. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఐదు రోజుల కిందట దగదర్తి మండలం సున్నపుబట్టి గిరిజన కాలనీ పాతూరులో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను బుచ్చిరెడ్డిపాళెం సీఐ బి.సురేష్‌బాబు బుధవారం వెల్లడించారు. సున్నపుబట్టి గిరిజన కాలనీ పాతూరులో కలగందల పోలయ్య, మంగమ్మ దంపతులు నివాసముంటున్నారు. పోలయ్య నెల్లూరులో కూలీ పనులకు వెళ్లి వస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం కాగా మరో పదహారేళ్ల కుమార్తెకూ పెళ్లి చేయాలని పోలయ్య ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ వివాహం భార్య, కుమార్తెకు ఇష్టం లేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది.

ఈ క్రమంలో మే 30వ తేదీన పోలయ్య నెల్లూరు నుంచి తన భార్యకు ఫోన్‌చేసి పెళ్లి విషయమై వాదులాటకు దిగాడు. దీనికి మంగమ్మ నిరాకరించడంతో అయితే నువ్వు చచ్చిపో అంటూ పోలయ్య భార్యను తిట్టాడు. దీంతో మంగమ్మ ఆవేశంతో చనిపోతానంటూ బయటకు వెళ్లిపోయింది. వీరు ఉంటున్న ఇంటికి సమీపంలోనే మంగమ్మ తల్లిదండ్రులు ఉప్పు వెంకటేశ్వర్లు, రమణమ్మ నివాసముంటున్నారు. కూతురు ఆవేశంగా బయటకు వెళ్లిపోవడంతో రమణమ్మ వెతుక్కుంటూ వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో పదహారేళ్ల బాలిక మాత్రమే ఉంది. అయితే రమణమ్మ తన కుమార్తె మంగమ్మను తీసుకుని తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి బాలిక విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేయగా.. పెళ్లి విషయంలో బాలిక మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, తన తండ్రి చూసి చున్నీ కట్‌ చేసి మృతదేహాన్ని కిందికి దించాడని మంగమ్మ పోలీసులకు తెలిపింది. అయితే మృతురాలి మెడకు ఉరేసుకున్న గుర్తులు లేవు.

మృతురాలి తాత, అమ్మమ్మ మాటలకు పొంతన లేదు. అంతా అనుమానాస్పందగా ఉండడంతో పోలీసులు కుటుంబీకులపై అనుమానం పడ్డారు. అదే సమయంలో వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎంతో కాలంగా తన మనమరాలిపై కన్నేశాడని, ఒంటరిగా ఉండడంతో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్నారు. నిరాకరించే సరికి మెడను మెలి తిప్పి విరిచేశాడని పోలీసులు తెలిపారు. అపసార్మకస్థితిలోకి జారుకుంటుండగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఉరేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడుని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు