జేబుదొంగల ముఠా ఆటకట్టు

8 May, 2019 08:19 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉమామహేశ్వరశర్మ

ఉప్పల్‌ స్టేడియం కేంద్రంగా చోరీలు

ఐదుగురు నిందితుల అరెస్ట్‌

ఉప్పల్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను టార్గెట్‌గా చేసుకుని  క్రీడాభిమానుల జేబులను కొల్లగొడుతున్న పిక్‌పాకెటర్లను సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, క్రైం అడిషనల్‌ డీసీపీ సలీమా, ఏసీపీ సందీప్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. గత నెల 29న ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా పోలీసులు క్రికెట్‌ స్టేడియం లోపల, బయట దాదాపుగా 300 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. వారిని ఘరానా పిక్‌ పాకెటర్స్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు.

మహారాష్ట్రకు హత్‌వలీ రవి మల్లెపల్లిలోని మణిగిరి బస్తీలో కిరాణా షాప్‌ నిర్వహిస్తున్నాడు. చిన్నతనం నుంచే పిక్‌పాకెటింగ్‌కు అలవాటు పడిన అతడిపై పలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 16 కేసులు ఉన్నాయి. పలుమార్లు జువైనల్‌ హోమ్‌కు వెళ్లి వచ్చాడు. స్కూటర్‌ మెకానిక్‌గా పని చేస్తున్న ఇదే ప్రాంతానికి చెందిన కాంబ్లే ఆకాష్‌పై వివిధ పోలీస్‌స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరు కాంబ్లే కిరణ్, హత్‌వలీ కిరణ్, కాంబ్లే లక్ష్మణ్‌తో కలిసి ముఠాగా ఏర్పడి పర్సులు, బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్నారు. చోరీ సొత్తును  మల్లెపల్లికి చెందిన బొల్లెపల్లి హారతికి విక్రయించేవారు. వీరి నుంచి రూ.5.78,000 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా బొల్లెపల్లి హారతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీసీఎస్‌ మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ లింగయ్య, జగన్నాధంరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శివశంకర్‌రావు, శ్రీదర్‌రెడ్డి, రవిబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు