షర్మిల ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం

17 Jan, 2019 17:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌:  ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్‌ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సోషల్‌ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ షర్మిల తన భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు షర్మిలపై అసత్య ప్రచారాలు చేస్తున్న సైట్లను గుర్తించారు. (ఎందుకింత దిగజారుడు రాజకీయాలు?)

12 యూఆర్‌ఎల్‌ నంబర్ల ఐపీ అడ్రస్‌ల కోసం పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. ఐపీ అడ్రస్సులు అందగానే సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసుల జారీ చేయనున్నారు. రెండు రోజుల్లో గూగుల్‌ నుంచి ఐపీ అడ్రస్సులు అందే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఐపీ చిరునామా ఆధారంగా నిందితులను వెలికి తీస్తామని, రెండు మూడు రోజుల్లోనే ట్రోల్స్‌ చేస్తున్న వారి వివరాలు వెలుగులోకి వస్తాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. ఇక పోలీసుల విచారణ తెలుసుకుని అసభ్యకర పోస్టులను నిందితులు తొలగించినట్లు తెలుస్తోంది. అయితే నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే లేదని పోలీసులు వివరించారు. (షర్మిల ఫిర్యాదుపై చంద్రబాబు ఎదురుదాడికి దిగడమేంటి?)

మరిన్ని వార్తలు