యూట్యూబర్‌ పైత్యం: మండిపడుతున్న నెటిజనులు

8 Nov, 2023 17:41 IST|Sakshi

యూట్యూబ్‌లో లైక్స్‌, వ్యూస్‌  కోసం  కొంతమంది  వింత విన్యాసాలు, ప్రమాదకర ఫీట్స్‌తో  సోషల్‌మీడియా యూజర్లకు చిరాకు తెప్పించడం ఈ మధ్య కాలంలో  రొటీన్‌గా మారి పోయింది.  ఈ క్రమంలోనే రైలు పట్టాలపై  పటాకులు కాల్చిన వీడియో   నెటిజనులకు ఆగ్రహం తెప్పింది.  రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై యూట్యూబర్  నిర్భయంగా పటాకులు  స్నేక్‌  క్రాకర్స్‌ కాల్చుతున్న వీడియో ట్విటర్‌లో వైరల్‌ అయింది. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లకు, యూట్యూబర్ల అతి చేష్టలకు హద్దు పద్దూ లేకుండా పోతోందంటూ  ఆగ్రహం పెల్లుబుకింది.  దీనిపై చర్యలు తీసుకోవాలంటూ  రైల్వే శాఖను ట్యాగ్‌ చేస్తూ  రీట్వీట్‌ చేశారు. దీంతో ర్వైల్వే శాఖ స్పందించింది.  

ఫూలేరా-అజ్మీర్ సెక్షన్‌లోని దంత్రా స్టేషన్ సమీపంలో ఈ వీడియోను షూట్‌ చేసినట్టు తెలుస్తోంది.ఇందులో రైలు పట్టాలపై కుప్పగా పోసిన పాము బిళ్లల్ని ఒక్కసారిగా వెలిగించాడు. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది.33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రైన్స్ ఆఫ్ ఇండియా ట్వీట్‌ చేసింది. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై అవసరమైన చర్యలు తీసుకోండి అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్‌ చేసింది.

ఏదైనా అనుకోని  ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి...ప్రాణాలతో చెలగాటాలా అంటూ ఒకరు, అసలే దేశమంతా కాలుష్యంతో మండిపోతోంది. దీపావళి సందర్భంగా పిల్లలు ఎక్కువగా ఇష్ట పడే ఈ పాము బిళ్ళలు ఎక్కువ కార్బన్‌ను రిలీజ్‌ చేస్తాయంటూ మరొకరు మండిపడ్డారు.  పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా?  పర్యావరణం కలుషితమవుతోంది. రైలు పట్టాల దగ్గర ఇలాంటి ప్రయోగాలు ప్రమాదకరం అంటూ తీవ్రంగా స్పందించడం గమనార్హం.  అంతేకాదు ఇది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు..చర్యలు తీసుకోండి అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి  విజ్ఞప్తి చేశారు.  

దీంతో ఈ వీడియోపై నార్త్ వెస్ట్రన్ రైల్వే స్పందించింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆదేశించింది. ప్రస్తుతం వీడియోపై ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే స్నేక్ క్రాకర్స్‌ అనేవి అత్యధిక  మోతాదులో PM2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పర్టిక్యులేట్ మ్యాటర్)ను విడుదల చేస్తాయని   2016నాటి చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ (CRF), పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో  తేలింది. 

మరిన్ని వార్తలు