టీవీ చూస్తూ ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే

8 Nov, 2023 16:08 IST|Sakshi

టూత్‌పేస్ట్ అనుకుని  డీప్‌ హీట్‌ క్రీమ్‌తో బ్రష్ 

టీవీ చూస్తూ చాలా పనులు చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. కొంతమంది దర్జాగా రిమోట్‌ తిప్పుతూ టీవీని ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. మరికొంతమంది  ఏ  సిరీయల్లో చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అలాగే కూరగాయలు కట్‌ చేస్తూనో,  పిల్లలకు అన్నం తినిపిస్తూనో టీవీ షోలను చూస్తూ ఉంటారు. పరధ్యానంగా  టీలో  పంచదారకు బదులు ఉప్పు వేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదేమో కానీ  ఒక్కోసారి ఊహించని సమస్యకి  దారి తీస్తుంది. మహిళ టీవీ చూస్తూ ఒకటి చేయబోయి.. ఇంకోటి చేసి ఆ తరువాత ఇబ్బందులు పడింది.  పరధ్యానానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన తరువాత ఇపుడు మనమంతా కాస్త జాగ్రత్త పడాల్సిన వార్త ఇది. 

అసలు విషయం ఏమిటంటే..డైలీ స్టార్‌  కథనం ప్రకారం మియా కిట్టిల్సన్ అనే మహిళకి బెక్ హమ్(Beckham) డాక్యు సిరీస్‌ అంటే   పిచ్చి.  దీనిపై బాయ్‌ ఫ్రెండ్‌తో  చర్చిస్తుంది కూడా. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమె పళ్లుతోముకునేందుకు టూత్ పేస్ట్ కు బదులుగా పెయిన్‌ కిల్లర్‌ క్రీమ్‌ డీప్ హీట్ క్రీమ్  వాడేసింది. ఇంకేముందు నోటిలో చురుక్కున మండడంతో అప్పుడు వాస్తవంలోకి వచ్చింది. ఘాటైన వాసనతో ఇబ్బంది పడింది.  దీంత విషయం తెలిసిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ పాయిజన్ కంట్రోల్ కు కాల్ చేశాడు.

తన షాకింగ్‌ అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్‌  చేసింది. అది కోల్‌గేట్ టూత్‌పేస్ట్‌లానే ఉంది అంటూ నొప్పి నివారణ క్రీమును వాడిన వైనాన్ని వివరించింది. దీంతో నెటిజను కమెంట్ల వర్షం కురిపించారు. టిక్‌టాక్‌లో  కిట్టెల్సన్ వీడియోకు వచ్చిన  వ్యూస్‌ 10 లక్షలకు పై మాటే అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఏమేరకు  వైరల్‌ అయిందో.  

ఇది ఇలా ఉంటే గతంలో న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళ కోల్డ్ సోర్ క్రీం బదులుగా పెదాలకు సూపర్‌గ్లూను రాసేసుకుంది. తెలుసుగా గ్లూ రాసుకుంటే ఏమవుతుందో.. పెదాలకు అతుక్కుపోయి నానా బాధలు పడింది. విపరీతమైన జలుబుతో బాధపడింది. చివరికి వైద్యులు  పారాఫిన్ ఆయిల్‌తో  ఆమె పెదవుల సీల్‌ను విప్పారు.  సో.. తస్మాత్‌   జాగ్రత్త!

మరిన్ని వార్తలు