ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

15 Jul, 2019 18:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్‌ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్‌ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్ధిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగురు కీలక నిందితులైన కోగంటి సత్యం, శ్యామ్‌, ప్రసాద్, ప్రీతమ్, రాములను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసు వివరాలను వెస్ట్ జోన్‌  డీసీపీ శ్రీనివాస్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు.

భూ వివాదమే హత్యకు కారణమని... పక్కా పథకం ప్రకారమే రాంప్రసాద్‌ను హతమార్చారని...హత్యకు నెల రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించారని డీసీపీ తెలిపారు. హత‍్య జరిగే సమయంలో కోగంటి సత్యం సోమాజిగూడ యశోదా ఆస్పత్రి సమీపంలోనే ఉన్నారని, హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. అయితే ఈ హత్య కేసులో తన ప్రమేయం లేకుండా ఉండేలా సత్యం జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

చదవండిరాంప్రసాద్‌ హత్య కేసులో సంచలన నిజాలు

కాగా రాంప్రసాద్‌, కోగంటి సత్యం చాలా ఏళ్లపాటు కలిసి వ్యాపారం చేశారని, ఈ నేపథ్యంలో కోగంటి సత్యంకు రూ.70కోట్లు రాంప్రసాద్‌ బాకీ పడ్డారన్నారు. అయితే రూ.23 కోట్లు చెల్లించేలా ఇరువురి మధ్య సెటిల్‌మెంట్‌ జరిగిందని, చెల్లించాల్సిన రుణాన్ని భారీగా తగ్గించినా రాంప్రసాద్‌ అప్పు తీర్చలేదని కోగంటి సత్యం ఆగ్రహంతో కక్ష కట్టినట్లు చెప్పారు. ఈ హత్య కోసం రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు సత్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అనుచరుడు శ్యాం తన వాటర్‌ ప్లాంట్‌లోనే తయారైనట్లు చెప్పారు. కేసులో ప్రమేయం ఉన్న మరో ఆరుగురు పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు. ఇక కోగంటి సత్యంపై 21 కేసులు ఉన్నాయని తెలిపారు.

చదవండి‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’

మరిన్ని వార్తలు