టింబర్‌ డిపో మాటున ఎర్రచందనం రవాణా

23 Dec, 2019 11:48 IST|Sakshi
ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్ట్‌ చూపుతున్న సీఐ, ఎస్‌ఐలు

కర్నూలు, మహానంది: టింబర్‌డిపో పెట్టుకుని కలప విక్రయాల మాటున ఎర్రచందనంపై గురిపెట్టాడు. డిపోలోని సామగ్రికి చలనాలు కట్టి అదే పేరుతో ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో అన్నీ తేలాయి.  శేషాచలం నుంచి ముంబైకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కేసులో ఒకరికి అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ఆదివారం మరొకరిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా రూరల్‌ సీఐ మల్లికార్జున, మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి  మహానంది పోలీసుస్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న అంకిరెడ్డిచెరువు వద్ద హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన కల్యాణి యుగల్‌ కిశోర్‌ను అరెస్ట్‌ చేసి 177కిలోల బరువున్న 19 ఎర్రచందనం దుంగలు, 193కిలోల బరువున్న ఇతర 13 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు.  ఇదే కేసులో ముంబైకి చెందిన హారూన్‌ అబ్దుల్‌ లతీఫ్‌ను అరెస్ట్‌ చేశామన్నారు.

లతీఫ్‌.. ముంబైలో టింబర్‌ డిపో నిర్వహిస్తూ ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తుంటాడన్నారు. హైదరాబాద్‌లోని ఓ పార్సిల్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న కల్యాణి యుగల్‌ కిషోర్‌ సహకారం తీసుకునేవాడని చెప్పారు. జైపూర్‌లోని ఓ లాడ్జీలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడన్న సమాచారం మేరకు మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మూడేళ్ల నుంచి ఇలాంటి అక్రమ రవాణాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇదే కేసులో రుద్రవరం గ్రామానికి చెందిన ఎర్రశ్రీను, ఢిల్లీకి చెందిన సలీంల ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. వీరిని సైతం త్వరలోనే పట్టుకుంటామన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్‌ను పట్టుకున్న మహానంది ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ కృష్ణుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు