నమ్మిన వారే అమ్మేశారు..!

22 Dec, 2018 10:27 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ పోలీసుల అదుపులో నిందితులు

బాలికను నమ్మించి వ్యభిచార కూపంలోకి దింపిన బంధువు

ఎనిమిదిమంది సభ్యుల ముఠా అరెస్టు

బాధితురాలికి విముక్తి

నాగోలు: ఓ బాలికకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపిన ఆమె దూరపు బంధువు, అతడి భార్యతో పాటు మరో ఆరుగురు సభ్యుల వ్యభిచార ముఠాను చైతన్య పురి పోలీసులు అరెస్టు చేసి బాధితురాలికి విముక్తి కలిగించారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు. ఎల్‌బీనగర్‌కు చెందిన యార్లగడ్డ చంటి, అతడి భార్య పద్మతో కలిసి ఎన్టీఆర్‌నగర్‌లో ఉంటున్నాడు. అమెజాన్‌ కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను తన దూరపు బంధువైన అదే ప్రాంతానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అనంతరం తన భార్య పద్మతో కలిసి 2 నెల 9న ఆమెను మహబూబ్‌నగర్‌ జిల్లా, జడ్చర్లకు తీసుకెళ్లి వ్యభిచారం నిర్వహించే ముఠాకు అప్పజెప్పాడు.

బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె నాయనమ్మ  చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు బాలిక జడ్చర్లలో ఉన్నట్లు గుర్తించారు. చంటి, పద్మలపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో బాలికను జడ్చర్లలోని వ్యభిచార ముఠాకు అప్పగించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వ్యభిచార  ముఠా నిర్వాహకులు ఫరీదాబేగం, కృష్ణవేణి, స్వరూప, పద్మ, మంజూల, రాధలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. చంటిపై అత్యాచారంతో పాటు పలుకేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్‌ బాలిక కేసును త్వరితగతిన చేధించిన చైతన్యపురి పోలీసులను డీసీపీ అభినం దించారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీథర్‌రావు, చైతన్యపురి సీఐ సుదర్శన్, ఎస్‌ఐ సాయిప్రకాశ్‌ పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి బాలికకు విముక్తి కలిగించిన రాచకొండ పోలీసులకు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతారావు శుక్రవారం అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు