ఫేస్‌బుక్కయ్యాడు!

25 Aug, 2018 12:30 IST|Sakshi
పేస్‌బుక్‌ ద్వారా మోసం చేసిన మైఖేల్‌ ఎస్తేర్‌ డోనాల్డ్‌

పెట్టుబడులు పెడతామంటూ గాలం

అమెరికా అకౌంట్‌కు  రూ. 28 లక్షల చెల్లింపులు

ముందస్తు పన్నుల పేరిట  డబ్బులు చెల్లించిన ఎస్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగి

మోసపోయానంటూ పటమట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు

అమెరికన్‌ డాలర్లకు ఆశపడి ఓ రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి మోసపోయిన ఘటన విజయవాడలోని పటమట దర్శిపేటలో వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి కోసం అమెరికన్‌ డాలర్లు పంపిస్తామని యూఎస్‌కే చెందిన  మైఖేల్‌ ఎస్తేర్‌ డోనాల్డ్‌ అనే మహిళ నుంచి ఆరు నెలల కిందట ఆ ఉద్యోగికి వీడియో కాల్‌ వచ్చింది. దీంతో రూ.28 లక్షలు వారి అకౌంట్‌లో డిపాజిట్‌ చేసి మోసపోయాడు.

ఆటోనగర్‌(విజయవాడ):  ‘మా వద్ద రెండు లక్షల అమెరికన్‌ డాలర్లు ఉన్నాయి.. మీకు పెట్టుబడిగా ఆ డబ్బును సమకూరుస్తాం.. మీరు ఏదైనా వ్యాపారం మొదలెట్టండి.. లాభాల్లో మీకు వాటా ఇస్తాం..’ అంటూ  ఓ రిటైర్డ్‌ ఎస్‌బీఐ ఉద్యోగికి 6 నెలల కిందట అమెరికాకు చెందిన మైఖేల్‌ ఎస్తేర్‌ డోనాల్డ్‌ అనే మహిళ నుంచి ఫేస్‌బుక్‌ వీడియో కాల్‌ వచ్చింది. ముందు వెనుకా ఆలోచించకుండా ఆ ఉద్యోగి ఆమె చెప్పిన విధంగా రూ. 28 లక్షలు వారు తెలిపిన అకౌంట్‌లో జమ చేశాడు. ఆ తరువాత అటువైపు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తాను మోసపోయానని తెలుసుకుని శుక్రవారం పటమట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, బాధితుడు ఫిర్యాదు పేర్కొన్నట్లుగా వివరాలు ఇలా ఉన్నాయి..

పటమట దర్శిపేట చెందిన వెంకట సత్యప్రసాద్‌ ఎస్‌బీఐ రిటైర్డ్‌ ఉద్యోగి. ఇతనికి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన మైఖేల్‌ ఎస్తేర్‌ డోనాల్డ్‌ అనే మహిళ నుంచి ఫేస్‌బుక్‌ వీడియో కాల్‌ వచ్చింది. తన వద్ద 2 లక్షల అమెరికా డాలర్లు ఉన్నాయని.. మీకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించుకోవచ్చని నమ్మబలికింది. దీంతో సత్యప్రసాద్‌ ఆమెతో పలు దఫాలు డాలర్ల విషయమై ఫేస్‌బుక్‌ ద్వారా చాటింగ్‌ చేయడం.. మాట్లాడం జరిగింది. ఆ తర్వాత అతనితో అమెరికాకు చెందిన మ్యాత్యు టేలర్‌తోపాటు అజయ్‌ అనే మరొ వ్యక్తి కూడా ఫోన్‌ ద్వారా పరిచయమయ్యారు. వారు ముగ్గురు కలిసి మీకు డబ్బులు పంపిస్తాం కానీ పెట్టుబడుల పెట్టే నిమిత్తం కొంత డబ్బు పన్ను రూపేణ చెల్లించాల్సి ఉంటుందని ఆమె చెప్పింది. అకౌంట్‌ నెంబరు కూడా ఇచ్చింది. అన్నింటికీ అంగీకరించిన ఆ ఉద్యోగి పలు దఫాలుగా రూ. 28 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత వారి నుంచి ఎటువంటి ఫోన్‌ రాకపోవడం.. ఫేస్‌బుక్‌ నుంచి కూడా చాటింగ్‌లు నిలిచిపోవడంతో ఆత్యాశకుపోయి ‘బుక్కయ్యాను’ అనుకున్న సత్యప్రసాద్‌ శుక్రవారం పటమట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు