కాచిగూడ –యశ్వంత్‌పుర్‌ రైల్లో దోపిడీ

23 Sep, 2018 02:06 IST|Sakshi
అశోక్‌కుమార్‌

రూ.10వేల నగదు, 28.4 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు 

హైదరాబాద్‌: బెంగళూరు నుంచి కాచిగూడకు వస్తున్న యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీ జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రయాణీకుల వద్ద నుంచి 28.4 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు, సెల్‌ఫోన్లను గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు. సికింద్రాబాద్‌ రైల్వే ఎస్‌పి జి.అశోక్‌కుమార్‌ కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దివిటిపల్లి వద్ద కొంతమంది దుండగులు రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్‌ చేసి ప్రయాణీకుల వద్దనుంచి బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లను దొంగలించారని తెలిపారు.

బెంగళూరుకు చెందిన నిమ్మి గీత (27) మెడలోంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, బ్యాగులో ఉన్న 3 సెల్‌ఫోన్లు, రూ.10వేల నగదు, మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన కె.జయశ్రీ (57) వద్ద నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, శ్రీకాకుళం, రాజం ప్రాంతానికి చెందిన బలివాడ లక్ష్మి (65) నుంచి 2.4 గ్రాముల బంగారు ఆభరణాలు, కర్నాటకలోని బాగేపల్లి ప్రాంతానికి చెందిన లాల్యం లలిత (40) నుంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌ బోడుప్పల్‌ ప్రాంతానికి చెందిన హుస్సేన్‌ ఫీరా (54) నుంచి ఒక సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఉదయం 4గంటల సమయంలో రైల్లో కిటికీలు తెరిచి ఉంచిన ప్రయాణీకుల వద్ద ఈ ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లను దొంగిలించారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. 

మరిన్ని వార్తలు