పాయకరావుపేటలో భారీ చోరీ

5 Oct, 2019 12:21 IST|Sakshi
స్థానికుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ విభీషణరావు

25 తులాల బంగారం, 50 తులాల వెండి, 50 వేల నగదు అపహరణ

ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడీ రంగంలోకి దిగిన పోలీసులు

పాయకరావుపేట రూరల్‌: పట్టణంలోని కొప్పుల వారి వీధిలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి భారీగా బంగారం, వెండి ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు దోచుకుపోయారు. ఇంటి యజమానులు లేకపోవడాన్ని చూసి ఈ దోపిడీకి పాల్పడారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. పట్టణంలోని కొప్పుల వారి వీధికి చెందిన తాటిపాకల ప్రసాదరావు, వరలక్ష్మి దంపతులు గత నెల 27న కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. ఇంటి తాళాన్ని వీరి దిగువ పోర్షన్‌లో నివాసం వుంటున్న మేడిశెట్టి కొండలరావుకు అప్పగించారు. ఇంటిలో వున్న ఎక్వేరియంలోని చేపలకు ప్రతీ రోజూ మేత వేయాలని కొండలరావు కుటుంబ సభ్యులను కోరారు. అయితే ఇంటి యజామని ప్రసాదరావు కుమారుడు తాటిపాకల కార్తీక్‌ నాయుడు రాంబిల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో లైన్‌మేన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి  అధికారులు మంజూరు చేసిన సెలవులు అయిపోవడంతో విధుల్లో  చేరేందుకు తిరుపతి నుంచి ఒక్కడే శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇంటికి చేరుకున్నాడు.

కొండలరావు కుటుంబ సభ్యుల వద్ద తాళం చెవి తీసుకొని పైఫ్లోర్‌కు వెళ్లిన కార్తీక్‌ నాయుడు తన ఇంటి తలుపులకు ఉన్న తాళం గెడలు విరగొట్టి ఉండటాన్ని గమనించాడు. తలుపులు కూడా దగ్గరకు జారవేసి ఉండటంతో లోపలికి వెళ్లగా, ఇంటిలో బీరువా తెరచి ఉండటం, వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని చూసి దొంగతనం జరిగిందని గ్రహించాడు. వెంటనే స్థానిక పోలిసులకు ఫిర్యాదు చేశాడు. నక్కపల్లి సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ విభీషణరావు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రసాదరావు కుమారుడు తాటిపాకల  కార్తీక్‌ నాయుడు మాట్లాడుతూ తన ఇంటిలో సుమారు 25 తులాల బంగారం,  50 తులాల వెండి, 50 వేల నగదు, 50 వేల ఖరీదు చేసే హోమ్‌ థియేటర్‌ చోరికి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీర్థయాత్రల్లో ఉన్న కుటుంబ యజమానులు వస్తే ఎంత మొత్తంలో బంగారం, వెండి, నగదు చోరీకి గురయిందో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. 

మునగపాకలో...
మునగపాక (యలమంచిలి): పొలం నుంచి వస్తున్న మహిళ మెడలోని బంగారు వస్తువులను గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పరారయ్యాడు. వివరాలిలావున్నాయి. మునగపాక గ్రామానికి చెందిన టెక్కలి సన్యాసమ్మ శుక్రవారం సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమె మెడలోని నాలుగుతులాల బంగారు ఆభరణాలను తెంపుకొని సమీపంలోని పొలంలోకి పారిపోయాడు. దీంతో బాధితురాలు సన్యాసమ్మ కేకలు వేయడంతో సమీపంలోని రైతులు దొంగకోసం వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న మునగపాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ. 1.5 లక్షలకు పైగా ఉంటుందని బాధితురాలు తెలిపింది.  

మరిన్ని వార్తలు