ప్రాణం తీసిన ఈత సరదా

29 Mar, 2019 13:53 IST|Sakshi
మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు, మృతిచెందిన చౌహాన్‌ దశరథ్‌

సాక్షి, నేరడిగొండ(బోథ్‌): ఈత సరదా బాలుడి ప్రాణం తీసింది. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం నవేదిరిలో చెరువులో మునిగి విద్యార్థి మృతిచెందిన సంఘటన మరువక ముందే నేరడిగొండ మండలంలో మరో ఘటన చోటు చేసుకుంది. నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్‌ దశరథ్‌(9), విజయ్, మహిపాల్, పవన్‌ స్నేహితులు. అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుకుంటున్నారు. గురువారం ఒంటిపూట బడి అనంతరం వెంకటాపూర్‌ సమీపంలో గల కడెం వాగులో ఈత కోసం వెళ్లారు. ఈ నలుగురు విద్యార్థులు ఒడ్డుపై బట్టలు విడిచి వాగులోకి దిగారు. అదే సమయంలో దూరం నుంచి వీరిని గమనించిన మత్సకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. కాని అప్పటికే నీటిలో మునిగిన దశరథ్‌ ఊపిరాడక మృతిచెందాడు. 

మిగతా వారిని కాపాడిన మత్స్యకారుడు..
విద్యార్థులు వాగులోకి దిగుతుండడాన్ని గమనించిన మత్స్యకారుడు బట్ట ఆశన్న కేకలు వేస్తూ వారిని హెచ్చరించాడు. నీటిలోకి దిగొద్దని అరిచాడు. కాని ఆశన్న అక్కడకు వచ్చే లోపే విద్యార్థులు నీటిలోకి దిగారు. ఆశన్న వెంటనే నీటిలోకి దిగి విజయ్, మహిపాల్, పవన్‌ను కాపాడాడు. ఊపిరాడక కొట్టుకుంటున్న దశరథ్‌ను పైకి లాగినా ఫలితం లేకుండా పోయింది. 

మత్స్యకారుడు బట్ట ఆశన్న 

గ్రామంలో విషాదం..
చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన చౌహాన్‌ వందన– సంజుకు ఇద్దరు కుమారులు, కుమా ర్తె ఉన్నారు. వీరిద్దరు గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్నారు. మొదటి సంతానం దశరథ్‌ చురుకుగా ఉండేవాడు. ప్రస్తుతం ఒంటిపూట బడులు నడుస్తుండడంతో మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈత కోసం వాగుకు వెళ్లి ఇలా విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఘటన స్థలానికి ఎస్సై భరత్‌సుమన్‌ చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు