సర్కారు బడుల్లో అల్పాహారం

16 Sep, 2023 02:36 IST|Sakshi

విజయదశమి కానుకగా అమలుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కూడా

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విజయదశమి కానుక ముందుగానే ప్రకటించింది. ఉదయం వేళ  విద్యార్థులకు అల్పాహారం అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉదయంపూట విద్యార్థులు ఖాళీ కడుపుతో వస్తుండడంతో చదువుపై ధ్యాస తగ్గుతోందని విద్యాశాఖ వర్గాల పరిశీలనలో తేలింది. 

దీనిని అధిగమించడంతోపాటు పిల్లలను శారీరకంగా మరింత పటిష్టంగా తయారు చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అల్పాహార పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తుండగా,  అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే కాకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఈ పథకం అమలు చేస్తారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 27 జారీ చేశారు.

వచ్చే నెల 24 నుంచి అమల్లోకి...
ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలుకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులను డీటైల్డ్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రణాళిక తయారు చేయాలని స్పష్టం చేసింది. ఈ పథకం కేవలం పాఠశాలల పనిదినాల్లోనే అమలులో ఉంటుంది. మొత్తంగా దసరా కానుకగా అక్టోబర్‌ 24 తేదీన ఈ పథకం  అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

బడిపిల్లలకు వరం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా పేదపిల్లలే. వారికి మధ్యాహ్న భోజన పథకం  ఎంతో ఉపయోగపడుతోంది. ఇక అల్పాహార పథకం వారికి సీఎం ఇస్తున్న వరంగానే చెప్పొచ్చు. ఈ పథకం అమలుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
–  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని స్వాగతిస్తున్నాం. బడికి వచ్చే పేదవిద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఆలోచనతో పథకాన్ని తీసుకురావడం శుభసూచకం. దీనిని శాశ్వతంగా అమలు చేయాలి. కార్యాచరణ ప్రణాళిక పకడ్భందీగా రూపొందించాలి.
– కె.జంగయ్య, చావ రవి, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు

ప్రభుత్వ మానవీయకోణం
సీఎం కేసీఆర్‌ మానవీయకోణంలో తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతం. సీఎం నిర్ణయం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
– జూలూరు గౌరీశంకర్, చైర్మన్, రాష్ట్ర సాహిత్య అకాడమీ

ఇది కూడా చదవండి: ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష

మరిన్ని వార్తలు