‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’

12 Jan, 2019 14:49 IST|Sakshi
ప్రియుడు రాహుల్‌ ముఖర్జీతో షీనా బోరా

సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. షీనా తల్లి, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ, ఆమె భర్త పీటర్‌ ముఖర్జీ కలిసి ఉద్దేశపూర్వకంగానే షీనా బోరాను హత్యచేసినట్లు ఇటీవలే కీలక సాక్షి సీబీఐ కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఇందులో భాగంగా సీబీఐ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. వర్లీ ఏరియాలోని మార్లో బిల్డింగ్‌(ఇంద్రాణీ- పీటర్‌ల నివాసం) మేనేజర్‌ మధుకర్‌ ఖిల్జీని విచారించారు.

ఈ క్రమంలో... షీనా బోరా హత్య జరిగిన నాటి నుంచి(ఏప్రిల్‌ 24, 2012) రెండు రోజుల పాటు (ఏప్రిల్‌ 24-26) రెండు రోజుల పాటు ఇంద్రాణీ తన ఫ్లాట్‌లోకి ఎవరినీ రానివ్వలేదని మధుకర్‌ పేర్కొన్నాడు. షీనాతో పాటుగా ఆమె సోదరుడు మైఖేల్‌ బోరాను కూడా హత్య చేసేందుకు ఇంద్రాణీ ప్రణాళిక రచించారని తెలిపాడు. ’ షీనా తన చెల్లెలని ఇంద్రాణీ చెప్పారు. ఏప్రిల్‌ 23 న నన్ను పిలిచి తన అనుమతి లేకుండా ఎవరినీ ఫ్లాట్‌ దగ్గరికి కూడా రానివ్వొద్దని చెప్పారు. ముఖ్యంగా పీటర్‌ కొడుకు రాహుల్‌ ముఖర్జీ(ఇంద్రాణీ సవతి కొడుకు)ని అస్సలు అనుమతించొద్దన్నారు. అందుకే రాహుల్‌ మార్లోకు వచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం’  అని మధుకర్‌ కోర్టుకు తెలిపాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో మధుకర్‌తో కలిసి 28 సాక్షులను ప్రాసిక్యూషన్‌ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఇక ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణీ ప్రస్తుతం బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

షీనా బోరా హత్య కేసు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్‌ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా  హతమార్చేందుకు జరిగిన  కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్‌ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు