కోహెడ ఎస్సైపై వేటు

16 Aug, 2018 10:33 IST|Sakshi
సంపత్‌ చేతికి అయిన గాయం

హుస్నాబాద్‌ ఏసీపీ ఆఫీస్‌కు అటాచ్‌

వాట్సాప్‌ ఫిర్యాదుకు  స్పందించిన సీపీ

సిద్దిపేటటౌన్‌/కోహెడ(హుస్నాబాద్‌): దొంగతనం చేశాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితుడి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించమే కాకుండా చితకబాదిన ఎస్సైపై వేటు పడింది. కోహెడ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన బొంత సంపత్‌ కూలి పనులు చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావి వద్ద ఆటోమేటిక్‌ స్టార్టర్‌ను సంపత్‌ చోరీ చేశాడన్న అనుమానంతో అతనిపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో బుధవారం సంపత్‌ను స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై సతీశ్‌.. అతడిని చితకబాదారు.

విషయం తెలుసుకున్న ఓయూ వడ్డెర విద్యార్థి సంఘం నాయకులు బుధవారం కోహెడ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. జరిగిన విషయం, బాధితుడి ఫొటోలను  పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఫోన్‌ వాట్సాప్‌ ద్వారా పంపించి.. ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్‌.. ఎస్సై సతీశ్‌ని విధుల నుంచి తొలగించడంతో పాటు హుస్నాబాద్‌ ఏసీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఎంత టి వారినైనా వదిలేది లేదన్నారు. వాట్సాప్‌ ఫిర్యాదుకు వెంటనే స్పందిం చిన కమిషనర్‌ను వడ్డెర సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా, జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు, ప్రజలను ఇబ్బంది పెట్టే పోలీస్‌ అధికారులపై ఫిర్యాదు చేసేందుకు రెండు రోజుల క్రితం వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. సంపత్‌ కేసు మొదటి వాట్సాప్‌ ఫిర్యాదుగా నమోదైంది. 

మరిన్ని వార్తలు