ఎస్‌ఐ నాగరాజు హల్‌చల్‌

8 Nov, 2023 02:04 IST|Sakshi

వెల్దుర్తి(కృష్ణగిరి): నంద్యాల జిల్లాకు చెందిన ఎస్‌ఐ బోడెల్ల నాగరాజు మద్యం మత్తులో స్వగ్రామంలో వీరంగం సృష్టించాడు. ఘర్షణ రేపి, వైరి వర్గంపై దాడులు చేశాడు. చివరకు ఆపేందుకు వచ్చిన పోలీసులపై సైతం దూషణలకు దిగడంతో సదరు ఎస్‌ఐతో పాటు మరో 13మందిపై కేసు నమోదైంది. వెల్దుర్తి ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి మండల పరిధిలోని సూదేపల్లె గ్రామానికి చెందిన బోడెల్ల నాగరాజు ఇటీవల ప్యాపిలి ఏఎస్‌ఐగా ఉండి పదోన్నతిపై నంద్యాల జిల్లాకు ఎస్‌ఐగా నియమితుడయ్యాడు. అక్కడి ఎస్పీ అటాచ్డ్‌గా విధి నిర్వహణలో ఉన్నాడు. స్వగ్రామమైన సూదేపల్లెకు వచ్చిన ఆయన సోమవారం రాత్రి మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతూ వీరంగం సృష్టించాడు.

రస్తా పంచాయితీ, దాయాదుల మధ్య మనస్పర్థలను, పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని వైరి వర్గం వారిపై దూషణలకు దిగుతూ తిరిగాడు. ఈ క్రమంలో తన వర్గానికి చెందిన మరో 13 మందిని కలుపుకుని గుంపుగా ప్రత్యర్థి వర్గంలోని వైకుంఠం అచ్చయ్య ఇంటికి వెళ్లి దాడి చేసి గాయపడ్చాడు. ఇదంతా గ్రామస్తులు కొందరు సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి వెల్దురి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకోగా ఎస్‌ఐ నాగరాజు బూతు పురాణం అందుకున్నాడు. అతని వర్గానికి చెందిన కొందరు పోలీసులపై దూషణలకు దిగి దాడికి ప్రయత్నించారు.

కాగా గాయపడిన అచ్చయ్య కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొంది మంగళవారం వెల్దురి పోలీస్‌స్టేషన్‌లో నంద్యాల జిల్లా ఎస్‌ఐ నాగరాజు, మరో 13 మందిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీనిపై వెల్దుర్తి సీఐ సురేశ్‌కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి విచారణ జరిపి బోడెల్ల నాగరాజు, రాముడు,శివరాముడు, నాగేంద్ర, తిమ్మరాజు, సుబ్బరాయుడు, ఈశ్వరయ్య, కోటేశ్వరులు, ప్రసాద్‌, సుబ్బయ్య, శివుడు, మద్దిలేటి, సంతోష్‌, పెద్ద తిమ్మన్న మరి కొందరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు