పిడుగుపాటు: తెలుగు రాష్ట్రాల్లో విషాదం

10 Oct, 2019 20:04 IST|Sakshi

వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృతి

సాక్షి, పశ్చిమగోదావరి/జోగులాంబ/కామారెడ్డి: తెలుగు రాష్ట్ర్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం చింతపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు పాస్టర్లు మృతి చెందారు. మృతులను నరసాపురానికి చెందినవారిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. పిట్లం గ్రామ శివారులో జాతీయ రహదారి విస్తరణలో విద్యుత్ స్తంభాల వద్ద పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కామారెడ్డి మండల కేంద్రంలో పిడుగు పాటుకు గురై దేమె రవి(23) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతునికి 9 నెలల కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ‌ రైతుకు చెందిన రెండు గేదెలు మృతి చెందాయి.

గొర్రెలపైకి దూసుకెళ్లిన బస్సు..
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపురం గ్రామం దగ్గర పెట్రోల్ బంకు సమీపంలో గద్వాల్ డిపో ఆర్టీసీ బస్సు గొర్రెల పైకి దూసుకెళ్లిడంతో 15 గొర్రెలు మృతిచెందాయి.

విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి..
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ లో విద్యుత్ కంచె తగిలి విద్యుత్ షాక్ తో ఇద్దరి మృతి చెందారు. మృతుల్లో ఒకరు రైతుకాగా, మరొకరు కూలీగా గుర్తించారు. అడవి పందుల కోసం కంచెకు రైతులు విద్యుత్ అమర్చడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.


 

మరిన్ని వార్తలు