సచిన్ కూతురి పేరిట అసభ్య పోస్టులు.. టెకీ అరెస్ట్

8 Feb, 2018 10:22 IST|Sakshi

సారా టెండూల్కర్ పేరుతో ఫేక్ అకౌంట్లు

రాజకీయ నాయకులపై సైతం అభ్యంతరకర పోస్టులు

నిందితుడి అరెస్ట్.. విచారణ చేపట్టిన పోలీసులు

సాక్షి, ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పేరిట ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని పోలీసులు తెలిపారు. నితిన్ షిశోడే అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్థానిక అంధేరీలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ టెకీ సెలట్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం, వారి కూతుళ్ల పేరిట సోషల్‌ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేయడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న ఫేస్‌బుక్, ట్వీటర్ ఖాతాలు నకిలీవని అసలు వారికి సోషల్ మీడియా అకౌంట్లు లేవని.. కొందరు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ సంబంధిత సంస్థలకు సచిన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో నిందితుడు నితిన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సారా పేరిట ఫేక్‌ ట్వీటర్ అకౌంట్ క్రియేట్ చేసి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై అభ్యంతరకరమైన పోస్ట్‌లు చేసినట్లు సైబర్ విభాగం పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీలు, వారి కూతుళ్ల పేరిట ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి కొందరు ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడతారని.. చివరికి చేసిన తప్పులకుగానూ కటకటాలపాలు కావాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

గతంలో సచిన్ ఆందోళన
తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ గతంలో సచిన్ వరుస ట్వీట్లు చేశారు. తన కూతురు, కుమారుడికి ట్విట్టర్ లో అసలు ఖాతాలే లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని ట్వీట్ లో రాసుకొచ్చారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి లేనిపోని విషయాలు, తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. 2014లో సచిన్ ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సారా, అర్జున్ ట్విట్టర్ లో లేరని, వారి పేర్లతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను విశ్వసించవద్దని చేసిన పోస్టును స్క్రీన్‌ షాట్ తీసి షేర్ చేశారు.

మరిన్ని వార్తలు