ఒకే రోజు తల్లీకొడుకుల మృతి

1 Mar, 2018 09:41 IST|Sakshi
మృతుడి భార్య, పిల్లలు కృష్ణ (ఫెల్‌)

అమ్మ అంత్యక్రియలకు వస్తూ రైలు ప్రమాదంలో దుర్మరణం

కర్నూలు జిల్లా డోన్‌ రైల్వే స్టేషన్‌లో దుర్ఘటన

మృతులిద్దరిదీ రోలుగుంట మండలం కొమరవోలు

ఆ కుటుంబంపై మృత్యువు పగపట్టినట్టు ఉంది. ఒకే రోజు తల్లీకొడులను కబళించింది. తల్లిమరణ వార్త విని, పుట్టెడు దుఃఖంతో కడసారి చూసి, అంత్యక్రియలు నిర్వహించేందుకు వస్తున్న కుమారుడు రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం అలముకుంది. తండ్రి వస్తాడని ఎదురుచూస్తున్న పిల్లలకు ఆ పిడుగులాంటి వార్తను ఎలా చెప్పాలో తెలియక బంధువులు ఆవేదన చెందారు.

రోలుగుంట(చోడవరం):   మండలం కొమరవోలు గ్రామానికి చెందిన గొల్లు కృష్ణకు ఏడాది వయస్సులోనే తండ్రి అప్పలనాయుడు మృతి చెందాడు. తల్లి బుల్లమ్మ తన రెక్కల కష్టంపై పెంచి, పెద్ద చేసింది.  అదే  గ్రామానికి చెందిన  లక్ష్మితో వివాహం జరిపించింది. కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ కృష్ణ బతుకుబండి లాగుతున్నాడు. తన ఇద్దరు పిల్లలు(కుమార్తె లక్ష్మి ప్రసన్న ఇంటర్,  కుమారుడు  ఎనిమిదో తరగతి చదువుతున్నారు) పెద్ద అవుతుండడంతో వారి చదువులకు ప్రస్తుత ఆదాయం చాలక ఫిబ్రవరి మొదటి వారంలో  స్నేహితుల సాయంతో   కర్నాటక రాష్ట్రం, బల్లారికి కూలి పనికి వెళ్లాడు. బల్లారి వెళ్లి నెల తిరగకుండానే తల్లి బుల్లమ్మ మంగళవారం మరణించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కృష్ణకు తెలియజేశారు.

తల్లిని కడసారి చూసి, అంత్యక్రియలు నిర్వహించేందుకు  మంగళవారం బయలుదేరా డు. కర్నూలు జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద   కదులుతున్న ట్రైన్‌ ఎక్కుతుండగా ప్రయాణికుల తోపులాటలో అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు  తీవ్ర గాయం కాగా, కాలు విరిగిపోయింది. వెంటనే  కుటుంబ సభ్యుల కు ఫోన్‌లో తనపరిస్థితిని  కృష్ణ విరించాడు.ఆ తరువాత కొద్ది సమయానికే అతను మృత్యువాత పడ్డాడు. స్థానికులు అతని ఫోన్‌ నుంచి ఆ సమాచారాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు.   విషయం తెలుసుకున్న   సర్పంచ్‌ గొర్లె చెల్లమ్మనాయుడు మృతుడి బంధువులను   సంఘటనాస్థాలానికి బుధవారం తీసుకెళ్లారు.  తండ్రి మరణ వార్తను పిల్లలకు చెప్పలేదు.

శోక సంద్రంలో కొమరవోలు
తల్లీ, కుమారుడు ఒకే రోజు చనిపోవ డం గ్రామస్తులను తీవ్ర దిగ్బ్రాంతికి గురుచేసింది. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది అత్త, భర్త చనిపోవడంతో కుటుంబ పెద్దలను కోల్పోయానని, తాము ఎలా జీవించాలని మృతుడి భార్య కన్న లక్ష్మి గుండెలవిసేలా రోదించింది. 

మరిన్ని వార్తలు