గోదారిలో దూకి..

3 Nov, 2018 07:44 IST|Sakshi
నామన దివ్యవాణి బస్‌పాస్‌

చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి

దివ్యవాణిఅనే కాలేజీ విద్యార్థిని శుక్రవారం గల్లంతైంది.

పశ్చిమగోదావరి, యలమంచిలి: చించినాడ వంతెనపై నుంచి దొడ్డిపట్ల గ్రామానికి చెందిన నామన దివ్యవాణి అనే యువతి శుక్రవారం గోదావరిలోకి దూకి గల్లంతైనట్టు తెలిసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్‌ చూసి 100కు ఫోన్‌ చేయడంతో వారిచ్చిన సమాచారం మేరకు యలమంచిలి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. వంతెనపై వాణి పర్సు, జోళ్లు ఉన్నాయి. పర్సులో దివ్యవాణి బస్‌పాస్‌తోపాటు పాలకొల్లు నుంచి రాజోలు వెళ్లే బస్‌ టికెట్‌ ఉండడంతో దూకింది వాణియేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

వాణి పాలకొల్లు చాంబర్స్‌ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉదయం ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన వాణి పాలకొల్లులో రాజోలు బస్సు ఎక్కి చించినాడ వంతెన అవతలి వైపు దిగింది. అటు వైపు నుంచి నడుచుకుంటూ వంతెన మధ్యకు వచ్చి గోదావరిలో దూకినట్లు స్థానికులు చెప్పారు. వాణి దూకిన సమయంలో గోదావరిలో టూరిజం శాఖ స్పీడ్‌ బోట్‌ సమీపంలో ఉందని వారు దూకిన ప్రదేశానికి వెళ్లిన తేలకపోవడంతో ఏమీ చేయలేకపోయారని చెప్పారు. సమాచారం తెలుసుకున్న వాణి తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాణి తల్లి కుమారి గృహిణి. అన్నయ్య అశోక్‌ విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. ఎస్సై బొంతు సురేంద్రకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు