నయీం  కేసులో.. ఆ ఇద్దరిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

7 Jul, 2018 03:13 IST|Sakshi
మద్దిపాటి శ్రీనివాస్, మలినేని శ్రీనివాస్‌రావు

అదనపు ఎస్పీ మద్దిపాటి, ఏసీపీ మలినేనికి ఊరట

సస్పెన్షన్‌లోనే కొనసాగనున్న మరో ముగ్గురు అధికారులు

మద్దిపాటిపై కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌లో విచారణ..

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు అధికారుల్లో ఇద్దరిపై వేటు ఎత్తేస్తూ రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేశాయి. నయీంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీలు మలినేని శ్రీనివాస్‌రావు, చింతమనేని శ్రీనివాస్‌తోపాటు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను గతేడాది అప్పటి డీజీపీ అనురాగ్‌ శర్మ సస్పెండ్‌ చేశారు. గతేడాది మే నుంచి వీరంతా సస్పెన్షన్‌లోనే ఉంటూ వచ్చారు. తాజాగా తమ సస్పెన్షన్‌ ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన డీజీపీ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో శుక్రవారం వీరిద్దరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆదేశాలు వెలువడ్డాయి. అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది ఉత్తర్వులు వెలువరించగా, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిద్దరు శుక్రవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత తిరిగి విధుల్లోకి చేరినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే వీరికి ప్రస్తుతం ఏ పోస్టింగ్స్‌నూ డీజీపీ కార్యాలయం కేటాయించలేదు. అందుకు సంబంధించి త్వరలోనే ఆదేశాలిస్తారని రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ కాకుండా మిగిలిన ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌లోనే ఉన్నారని, ప్రస్తుతం వీరి విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

విచారణ జరుగుతోంది... 
అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు వ్యవహారంపై కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ నియమించిన రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సమ్మిరెడ్డి నేతృత్వంలో విచారణ జరుగుతోందని హోంశాఖ తెలిపింది. నయీం కేసులో ఆరోపణల నేపథ్యంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ విచారణ అనంతరం నివేదిక వస్తుందని, ఆ తర్వాత నివేదికలో పొందుపరిచిన అంశాలను బట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హోంశాఖ అధికారులు తెలిపారు. ఇకపోతే ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావు వ్యవహారంలో రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయం అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఎస్పీ ర్యాంకు అధికారి లేదా డీఐజీ ర్యాంకు అధికారి ఏసీపీ శ్రీనివాస్‌రావు వ్యవహారంలో మౌఖిక విచారణ జరిపి, నివేదిక అందిస్తారని హెడ్‌క్వార్టర్స్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నివేదిక అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపాయి. 

మరిన్ని వార్తలు