సతీషన్‌ స్మార్ట్‌గా కాజేసెన్‌!

7 Jul, 2018 11:17 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలు

అరెస్టు అయినప్పుడల్లా ‘బోర్డు’ మార్చి దందా

దాదాపు వంద మంది నుంచి రూ.3 కోట్లు స్వాహా

సూత్రధారితో పాటు ముగ్గురు నిందితుల అరెస్టు

రూ.45 లక్షలు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: కేరళలో పుట్టి పెరిగాడు... హైదరాబాద్‌లో డెన్‌ ఏర్పాటు చేసుకున్నాడు... కేసులు కావడంతో చెన్నైకి మకాం మార్చాడు... ఇలా మూడు రాష్ట్రాల్లోని దాదాపు 100 మందికి రుణాల పేరుతో రూ.3 కోట్ల టోకరా వేశాడు... ఈ ఘరానా నిందితుడితో పాటు ఇద్దరు అనుచరులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. వీరి నుంచి రూ.45 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 

జూనియర్‌ ఆర్టిస్ట్‌ కోసం సిటీకి...
కేరళలోని ధర్మాదం ప్రాంతానికి చెందిన సతీషన్‌ పాలయాడ్‌కు ఆంగ్లంపై మంచి పట్టు ఉండటంతో పాటు 1978లోనే ఎంఏ పూర్తి చేశాడు. అనంతరం చెన్నైకి మకాం మార్చిన ఇతను ఫిల్మ్‌ఫైనాన్షియర్‌గా మారాడు. 1984లో వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఇతడికి 1995లో ఖమ్మం నుంచి చెన్నైకు వెళ్లిన  జూనియర్‌ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది.

1996లో ఆమెను రెండో పెళ్లి చేసుకున్న సతీషన్‌ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఎల్బీనగర్‌లోని సహారా ఎస్టేట్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్లుగా దాని యజమాని ఖాళీ చేయమని చెబుతున్నా.. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి ఆ ఉత్తర్వులతో అదే ఫ్లాట్‌లో ఉంటూ హిమాయత్‌నగర్‌లోని తిరుమల ఎస్టేట్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేశాడు.

చిక్కితే బోర్డు తిప్పేస్తాడు...
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి రుణాలు, కొన్ని కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. బౌద్ధనగర్, పార్శిగుట్టల్లో ఉంటున్న అన్నదమ్ములు ఎస్‌.రామ్‌ నివాస్‌ (ఇంటర్మీడియట్‌), పార్శిగుట్టకు చెందిన ఎస్‌.హరి నివాస్‌లను (ఎంబీఏ) తన ప్రధాన అనుచరులుగా మార్చుకున్నాడు. రుణం, సీట్ల కోసం వచ్చే వారితో ఆంగ్లంలో మాట్లాడి బురిడీ కొట్టించేవాడు. ఆపై సీటు, రుణం ఖరారైనట్లు తన లెటర్‌ హెడ్‌పై రాసిచ్చి అందినకాడికి దండుకునే వాడు. ఇలా ఓబెరాన్‌ ఇంటర్‌నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ లేసియోన్‌  వర్క్స్‌ కార్యాలయం ముసుగులో మోసాలు చేసి 2012లో తొలిసారి అరెస్టయ్యాడు. జైలు నుంచి రాగానే దాని పేరును ప్రైమ్‌ టెక్‌ సొల్యూషన్స్‌గా మార్చి మోసాలు చేస్తూ 2015లో చిక్కాడు. ఆపై సంస్థ పేరును మెల్సా ఇంటర్‌నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫైనాన్స్‌గా మార్చి 2017 వరకు మోసాలు చేసి మరోసారి అరెస్టు అయ్యాడు. 

నిఘా పెరగడంతో చెన్నైకి...
గతేడాది బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఈ ముగ్గురూ ఇక తమ దందాలకు హైదరాబాద్‌ ‘అచ్చిరాదని’ భావించారు. చెన్నై మకాం మార్చారు.  అక్కడి వలసరివక్కం ప్రాంతంలో యూనివర్శల్‌ యాక్సిస్‌ ఇండియా పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపిన వారి స్థిరాస్తుల్ని వాల్యూవర్‌గా వచ్చే హరినివాస్‌ పరిశీలిస్తాడు. లోన్‌ రావడానికి ఒక శాతం ప్రాసెసింగ్‌ ఫీజు, అర శాతం స్టాంప్‌ డ్యూటీ, రెండు శాతం కమీషన్‌లతో పాటు ఒక నెల ఇన్‌స్టాల్‌మెంట్‌ ముందే చెల్లించాలని చెప్పేవారు. కస్టమర్‌కు నమ్మకం కలిగేలా ఓ లెటర్‌ హెడ్‌పై రుణం మంజూరైనట్లు రాసివ్వడంతో పాటు నగదును సైతం తన బ్యాంకు ఖాతాల్లోనే వేయించుకుంటాడు. ఆపై రుణం ఇప్పించకుండా వాయిదాలు వేస్తూ గడిపేస్తాడు. 

నెలకు రూ.5 లక్షల ఖర్చు...  
ఇలా ఖాతాలో పడిన మొత్తాన్ని గరిష్టంగా 48 గంటల్లో డ్రా చేసేస్తాడు. చెన్నైలోని సతీషన్‌ కార్యాలయంలో రామ్, హరిలతో సహా మొత్తం పది మంది పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలతో పాటు ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాడు. గతంలో డబ్బు చెల్లించిన వారు ఎవరైనా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తే తాజాగా చెల్లించిన వారు ఇచ్చిన డబ్బుతో పాత వారికి సర్దుబాటు చేస్తూ పోలీసుల వరకు విషయం వెళ్ళకుండా చూసుకునేవాడు. ఇలా హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో 100 మందిని రూ.3 కోట్ల మేర మోసం చేయడంతో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇటీవల సతీషన్‌ మేడిపల్లి ప్రాంతంలో ఇల్లు ఖరీదు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వం లో ఎస్సైలు వి.కిషోర్, పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్‌.భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ బి.ఏడుకొండలు వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. వీరిపై ఇప్పటి వరకు 14 కేసులు ఉన్నాయని, పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు