శేషాచలం అడవుల్లో వందకుపైగా తమిళ స్మగ్లర్లు !

27 Jul, 2018 07:00 IST|Sakshi
పట్టుబ‍డ్డ ఆహార పొట్లాలు, సామాగ్రి.. టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు

సాక్షి, తిరుపతి : శేషాచలం అడవుల్లో వంద మందికిపైగా తమిళ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి స్మగ్లర‍్ల కోసం టవేరా వాహనంలో ఆహార పొట్లాలను తీసుకురావటం అధికారులు గుర్తించారు. తిరుపతి ఎస్వీ జూ పార్కు సమీపంలో పొదల చాటున టవేరా బ్రాండ్‌ న్యూ కారు టాస్క్‌ ఫోర్స్‌ సీఐ మధు బృందం కంటపడింది. టవేరా కారు వద్దకు వారు వెళుతుండగా మరో కారు అక్కడకు చేరుకుంది. అధికారులను గమనించిన స్మగ్లర్లు కారును వేగంగా వెనక్కు తిప్పి చంద్రగిరి వైపు మళ్లించారు. దీంతో  సీఐ  మధు ఆ కారును వెంబడించారు.‌‌ కారు  వడమాలపేట మార్గంలో తప్పించుకుంది. దీంతో వెనక్కు వచ్చిన అధికారులు టవేరా వాహనాన్ని పరిశీలించగా అందులో వందకు పైగా చపాతీ ప్యాకెట్లు వాటికి కర్రీ ప్యాకెట్లు, బస్తా బియ్యం, వంటకు అవసరమైన వస్తువులు, 200 హాన్స్ ప్యాకెట్లు, బీడీ బండలు ఉన్నాయి.

అక్కడ కారును రిపేర్లు చేసిన బిల్లు వారికి దొరికింది. ఆ బిల్లులో తమిళనాడు ఆరణిలోని ఓ కారు మెకానిక్ షాపు అడ్రసు ఉంది. తిరువన్నామలై జిల్లాకు చెందిన రెండు అధార్ కార్డులు ఉన్నాయి. సీఐ మధు మాట్లాడుతూ.. అడవులలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపులు చర్యలు తీవ్రం చేయనున్నట్లు తెలిపారు. అధార్ కార్డుల అధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారి అచూకీ కనుగొంటామన్నారు.‌ ఖచ్చితంగా అడవులలో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు ఉన్నారని దానికి సంబంధించిన ఆధారాలు తమకు లభించినట్లు తెలిపారు. ఐజీ శ్రీకాంతారావు దీనికి సంబంధించిన సూచనలు అందజేశారు.  ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎస్ఐ సోమశేఖర్, రైటర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మరిన్ని వార్తలు