అదే అభిమానం.. ఆప్యాయత | Sakshi
Sakshi News home page

అదే అభిమానం.. ఆప్యాయత

Published Fri, Jul 27 2018 6:57 AM

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి , కాకినాడ: జననేతలో తొణికిసలాడే ఆ వ్యక్తిత్వమే సామాన్యుడికి గురి పెంచుతోంది. ఆ భావనే కష్టాన్ని చెప్పుకోవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఓపిగ్గా జననేత వింటున్న తీరు విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. అందుకే జగన్‌ ప్రజా సంకల్పయాత్ర రోజురోజుకూ జన హృదయాలకు దగ్గరవుతోంది. పల్లె పల్లెకూ ఆత్మీయతను పంచుతోంది. తమ కష్టాలను తీర్చే పెద్దబిడ్డ వచ్చాడన్న అనుభూతి పేదల్లో ప్రస్ఫుటమవుతోంది. నాలుగేళ్లుగా పడుతున్న యాతనను విపక్ష నాయకుడికి వివరించడంతో సాంత్వన చేకూరిందని ఊరట చెందుతున్నారు. అభిమాన నేత వెంట అడుగులో అడుగేస్తూ అండగా నిలుస్తున్నారు. గురువారం సాగిన ప్రజా సంకల్పయాత్రకు నీరాజనాలు పలికారు. పాదయాత్ర సాగిన రోడ్డు మార్గంలోని ప్రజలంతా జననేతతో కలిసి కదం తొక్కారు.

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 221వ రోజు పెద్దాపురంలోని శివారు నుంచి ప్రారంభమై కట్టమూరు జంక్షన్‌ వరకు కొనసాగింది. ఉదయం 8.45 గంటలకు మొదలైన పాదయాత్రకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. జననేతను చూసేందుకు రహదారులపై బారులు తీరారు. మహిళలు, యువకులు, విద్యార్థినీ, విద్యార్థులు జగన్‌తో కలిసేందుకు, కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ తీసుకునేందుకు పోటీ పడ్డారు. పాదయాత్ర చివరి వరకు జననేతతో కలిసి నడిచారు. బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు కూడా కిటికీల నుంచి అభివాదం చేయడంతో పాటు కరచాలనం కోసం ఆరాటపడ్డారు. 

ఎన్నెన్నో విన్నపాలు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లిన ప్రతిచోటా ప్రజలు తమ బాధలు చెప్పుకొన్నారు. నాలుగేళ్లుగా పడుతున్న కష్టాలను వివరిస్తున్నారు. ఎదుర్కొంటున్న సమస్యలను మొరపెట్టుకుంటున్నారు. గురువారం కూడా వైఎస్‌ జగన్‌ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి. విశాఖపట్నానికి చెందిన జాగారపు అప్పలనాయుడు, దేవి దంపతులు  క్యాన్సర్‌ వ్యాధితో పడుతున్న తన కుమారుడ్ని తీసుకువచ్చి బాధలు చెప్పుకొన్నారు. కీమో థెరపీ చికిత్స చేయించే స్తోమత తమకు లేదని, ఎలాగైనా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి ఆవేదనను ఓపిగ్గా విన్న జగన్‌ తప్పకుండా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాక కౌలు రైతులకు కష్టాలు మొదలయ్యాయని, పంటలు నష్టపోతున్నా తమకు పరిహారం అందడం లేదని, రుణాలు సైతం ఇవ్వడం లేదని వాపోయారు.

తమ బిడ్డ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, తమను ఆదుకోవాలని బొటు మరియమ్మ చెప్పుకోగా, ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనాన్ని పెంచాలని ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ ఫెడరేషన్‌ ఉపాధ్యాయులు వేడుకున్నారు.  వైద్య సదుపాయం కల్పించి, పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలని చేనేత కార్మికులు జగన్‌ను కలిసి కోరారు. ఇలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు కావడం లేదని విద్యార్థులు పేర్కొనగా, రుణమాఫీ జరగలేదని రైతులు, డ్వాక్రా మహిళలు చెప్పుకోగా, తమకు ఉపాధి దొరకడం లేదని మహిళా కూలీలు, ఉద్యోగ అకాశాలు రావడం లేదని నిరుద్యోగులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇదిలా ఉండగా, వైఎస్సార్‌ హయాంలో మెట్ట ప్రాంతంలో సాగునీరు అందించేందుకు కృషి జరిగిందని, కౌలు రైతులకు మేలు చేశారని, ప్రైవేటు అప్పులకు వెళ్లనక్కర్లేకుండా బ్యాంకుల్లో రుణాలు ఇప్పించారని వైఎస్‌ జగన్‌ వద్ద గుర్తు చేశారు. అధ్యాపకులుగా పనిచేస్తున్న పెద్దాపురానికి చెందిన అశోక్‌కుమార్, జానకి దంపతులు తమ అభిమాన నేతను కలసి తమ కుమారుడు అశ్రిత్‌కు అక్షరాభ్యాసం చేయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో చదువుకున్నామని, వైఎస్సార్‌ అంటే ఎంతో అభిమానమని జగన్‌ వద్ద తమ ఆనందాన్ని పంచుకున్నారు.

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్, సమన్వయకర్తలు తోట సుబ్బారావునాయుడు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, అనంత ఉదయ భాస్కర్, ధర్మాన క్రిష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, పార్టీ నాయకులు దవులూరి దొరబాబు, పితాని అన్నవరం, కొల్లి నిర్మలాకుమారి, ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర రాఘవరావు, మోరంపూడి శ్రీరంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement