చెప్పాల్సింది లేదు.. నాకేం తెలియదు! 

31 Oct, 2018 04:32 IST|Sakshi
హర్షవర్థన్‌ను విచారిస్తున్న సిట్‌ అధికారి లక్ష్మణమూర్తి (ఫైల్‌)

పాతపాటే పాడుతున్న నిందితుడు శ్రీనివాస్‌

తనకూ ఏమీ తెలియదంటున్న రెస్టారెంట్‌ యజమాని 

సాక్షి, విశాఖపట్నం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందించేందుకు కత్తితో పొడిచిన నిందితుడు శ్రీనివాసరావు బాటనే ఆయన యజమాని, టీడీపీ నేత తొట్టెంపూడి హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి ఎంచుకున్నారు. శ్రీనివాస్‌ విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ను హర్షవర్థన్‌ ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆ రెస్టారెంట్‌లోనే నిందితుడు శ్రీనివాస్‌ కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. అయితే విచారణలో శ్రీనివాస్‌ పోలీసులకు సహకరించడం లేదు. తాను చెప్పవలసిందేమీ లేదని, అంతా లేఖలోనే ఉందని చెబుతూ వస్తున్నాడు.

మరోపక్క శ్రీనివాస్‌ పనిచేస్తున్న రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ని ఘటన జరిగిన రెండ్రోజుల అనంతరం పోలీసులు ఒకసారి, ఆ తర్వాత మరో రెండుసార్లు అదుపులోకి తీసుకుని విచారించారు.  విచారణలో హర్షవర్థన్‌ శ్రీనివాస్‌కు సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వడం లేదని, ఆయన గురించి తనకేమీ తెలియదని చెబుతున్నాడు. నిందితుడి వెనక ఎవరున్నారు? శ్రీనివాస్‌ను ఎవరి సిఫార్సు మేరకు ఉద్యోగంలోకి తీసుకున్నారంటూ సిట్‌ పోలీసులు వేస్తున్న అనేక ప్రశ్నలకు ‘నాకేమీ తెలియదు’ అన్న సమాచారం తప్ప ఇంకేమీ చెప్పడం లేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

‘పెద్దల’ అండవల్లే..?
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ఇతర కీలక నేతలతో హర్షవర్థన్‌కు నేరుగా సంబంధాలున్నాయి. దీంతో పోలీసులు ఆయన నుంచి అదిలించో, బెదిరించో వాస్తవాలు రాబట్టలేకపోతున్నారని చెబుతున్నారు. చేసేదేమీ లేక విచారణకు పిలవడం, కాసేపు విచారించి వదిలిపెట్టేయడం చేస్తున్నారు. ఇక విచారణ సమయంలో హర్షవర్థన్‌ సిట్‌ అధికారుల ఎదుట కూర్చునే తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే సిట్‌ అధికారులను హర్షవర్థనే ప్రశ్నిస్తున్నట్టుగా ఉందని విచారణను చూసిన వారు చెబుతున్నారు. తన వెనక అధికార పార్టీ పెద్దలుండడం వల్లే ఆయన అలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన రోజు హర్షవర్థన్‌ నిందితుడు శ్రీనివాస్‌ను పరోక్షంగా వెనకేసుకొచ్చారు. అతను (శ్రీనివాస్‌) అలాంటివాడు కాదని, అమాయకుడని, సంచలనం కోసం చేసి ఉంటాడని చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు