శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం

28 Apr, 2018 11:26 IST|Sakshi
రోడ్డుకు అడ్డంగా పడిన టిప్పర్‌

రోడ్డుకు అడ్డంగా పడిన కంకర లోడు టిప్పర్‌

రెండు గంటల పాటు నిలిచిన వాహనాల రాకపోకలు

మండుటెండలో అవస్థలు పడిన ప్రయాణికులు

పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్‌లో టిప్పర్‌ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన మండల పరిధి చింతల గిరిజన గూడెం సమీపంలో శుక్రవారం  జరిగింది. శ్రీశైలం ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తడంతో సంఘటన స్థలానికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అందిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం నుంచి శ్రీశైలానికి కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ టైర్‌.. మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చింతల వద్ద బరస్టయింది.

టిప్పర్‌ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. డ్రైవర్, క్లీనర్‌లకు గాయాలయ్యాయి. వారి వివరాలు తెలియలేదు. రోడ్డు పక్కన కొంత మేర ఖాళీ ఉండటంతో చిన్న వాహనాలు మాత్రం ట్రాఫిక్‌ నుంచి బయట పడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్‌ బస్సులు, టారీలు టిప్పర్‌ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కొందరు ఆర్టీసీ, టిప్పర్‌ల సిబ్బంది రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్‌ఐ రామకోటయ్య, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న టిప్పర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. సుమారు 2 గంటల తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో ప్రయాణాకులు బతుకు జీవుడా..అంటూ బయటపడ్డారు.

ప్రయాణికుల అవస్థలు
ట్రాపిక్‌కు అంతరాయం ఏర్పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. సుమారు 43 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నట్టనడివిలో వాహనాలు నిలిచి పోవడంతో ఆయా వాహనాల్లో ప్రయాణించే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ అంతరాయం తొలగే వరకూ తీవ్ర ఉక్కపోత నడుమే ప్రయాణికులు తమ తమ వాహనాల్లో ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు వాహనాల్లో ఉండలేక సమీపంలో ఉన్న చెట్ల నీడన సేదతీరినా భానుడి ప్రచండ వీక్షణాలకు తట్టుకోలేక అల్లాడిపోయారు. ప్రయాణికుల నీటి ఇబ్బందులను ముందే గ్రహించిన ఎస్‌ఐ రామకోటయ్య తన వాహనంలో కూల్‌ కంటైనర్‌తో నీరు తెప్పించి ప్రయాణికుల దాహార్తి తీర్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా