చిన్నారులను చిదిమేశారు ! 

29 Aug, 2019 01:46 IST|Sakshi

డివైడర్‌ను ఢీకొన్న స్కూల్‌ వ్యాన్‌.. ముగ్గురు చిన్నారుల దుర్మరణం

ఫిట్‌నెస్‌ లేని వ్యాను..నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌

బస్సులోనుంచి ఎగిరిపడ్డ విద్యార్థులు.. వారిపైనే పడ్డ వ్యాన్‌ 

పాఠశాల ఓ చోట.. హాస్టల్‌ మరోచోట 

మధ్యాహ్న భోజనానికి వెళుతూ ఘటన 

సాక్షి, వేములవాడ : తమలాగే తమ పిల్లల బతుకులు మారొద్దనుకున్నారు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే అయినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలగన్నారు. కానీ విధి వారి జీవితాలతో ఆటాడుకుంది. పిల్లల గురించి ఎన్నోకలలుగన్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిల్చింది. ప్రైవేటు పాఠశాల యజమాన్య నిర్లక్ష్య వైఖరి.. ఫిట్‌నెస్‌లేని స్కూలు వ్యాన్‌.. డ్రైవర్‌ ఉన్మాదంతో అతివేగంగా వాహనం నడపడం వెరసి.. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముగ్గురు చిన్నారులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్‌ శివారులో బుధవారం స్కూల్‌వ్యాన్‌ బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణంలోని వాగేశ్వరి (శ్రీచైతన్య) హైస్కూల్‌కు పాఠశాల, హాస్టల్‌ వేర్వేరు చోట్ల ఉన్నాయి. విద్యార్థులు పట్టణ పరిధిలోని తిప్పాపూర్‌ శివారులో ఉన్న స్కూల్‌ హాస్టల్‌లో ఉంటారు. రోజూ పాఠశాల నుంచి స్కూల్‌ వ్యానులో హాస్టల్‌కు వచ్చి మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ స్కూల్‌కు వెళ్తుంటారు. ఎప్పటిలాగే.. బుధవారం కూడా మధ్యాహ్నం భోజనం కోసం 27 మంది విద్యార్థులు వ్యాన్‌ (ఏపీ 15 టీబీ 7800)లో హాస్టల్‌కు బయల్దేరారు. వేములవాడ ఆర్టీసీ డిపో ప్రాంతానికి రాగానే.. ఈ స్కూలు వ్యాన్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.

వాహనం వేగంగా ఉండడంతో అందులోని విద్యార్థులు కొందరు కిటికీల్లోంచి ఎగిరి బయట పడ్డారు. వీరిపైనే వ్యాన్‌ కూడా పడింది. దీంతో పదో తరగతి విద్యార్థిని కాసరవేణి మణిచందనారాణి (15), రెండో తరగతి విద్యార్థిని గుగులోతు దీక్షిత (6) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మూడో తరగతి విద్యార్థి రిషి (7) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఠాకూర్‌ రాకేశ్‌(15), గుమ్మడి సాయి నిఖిల్‌ (15), వేర్పుల అజయ్‌కుమార్‌ (15) మారుపాక రోహిత్‌ (9), గుండెకర్ల రేవంత్‌ (7) సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

స్పందించిన యువత 
ప్రమాదం సమయంలో అటుగా వెళ్తున్న తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన గణేశ్‌ మంటప నిర్వాహకులు బోల్తాపడిన స్కూలు వ్యాన్‌ను పైకి లేపారు. తద్వారా కొందరి ప్రాణాలు కాపాడిన వారయ్యారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం కావడంతో ఆగ్రహానికి లోనై.. వ్యాన్‌ డ్రైవర్‌ రఫీక్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. 
 
సంఘటన స్థలానికి మంత్రి, ఎంపీ 
విద్యార్థుల మృతి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వేర్వేరుగా సంఘటన స్థలాన్ని సందర్శించారు. మంత్రి బస్‌ డిపో ప్రాంతానికి చేరుకుని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

ఎంపీ బండి సంజయ్‌ కూడా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ మల్లేశంతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, జేసీ యాస్మిన్‌ బాషా, జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఆర్వో ఖీమ్యానాయక్, డీఈవో రాధాకిషన్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఎస్పీ వెంకటరమణ, సీఐ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్‌ నాయకులు ఆది శ్రీనివాస్, రంగు వెంకటేశ్‌గౌడ్‌ బాసటగా నిలిచారు. కాగా, ఘటనపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఫోన్లో ఆరా తీశారు. కాగా, బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తక్షణ సాయంగా రూ.2లక్షల చెక్కులను అందజేసింది. 
 
వ్యాన్‌కు ఫిట్‌నెస్‌ లేదు ! 
వేములవాడలో నిర్వహిస్తున్న వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్‌ వ్యాన్‌ (ఏపీ 15 టీబీ 7800)కు ఎలాంటి ఫిట్‌నెస్‌ లేదని పోలీసులు వెల్లడించారు. 15 సీట్ల సామర్థ్యం కలిగిన వ్యాన్‌లో సామర్థ్యానికి 27 మంది తీసుకెళ్తున్నారు. ఎలాంటి ఫిట్‌నెస్‌ లేకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. స్కూల్‌ హాస్టల్‌కు కూడా ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్నారని డీఈవో రాధాకిషన్‌ పేర్కొన్నారు. రోజూ చింతల్‌ఠాణా నుంచి వేములవాడకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విద్యార్థులను తరలిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రమాదం ముగ్గురి మృతికి కారణమైంది. కాగా, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారులు ఇంకా షాక్‌నుంచి కోలుకోలేదు. కళ్లముందే జరిగిన ప్రమాదాన్ని తలచుకుని వారు వణికిపోతున్నారు. 
 
బస్‌డిపోలో బాధిత కుటుంబాలతో చర్చలు 
ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ఈటల రాజేందర్‌ బస్‌డిపో ఆవరణలో జిల్లా అధికారులు, బాధిత కుటుంబాలతో సమాలోచనలు చేశా>రు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున అందజేయాలని సూచించినట్లు తెలిసింది. కాగా, వాగేశ్వరి (శ్రీచైతన్య) స్కూల్‌ అనుమతులను రద్దు చేస్తామని డీఈవో రాధాకిషన్‌ ప్రకటించారు. హాస్టల్‌ నిర్వహణకు ఎలాంటి అనుమతులూ లేనప్పటికీ.. యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘించినందుకు స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 
భద్రతపై పోలీసులను అప్రమత్తం చేస్తాం

వేములవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించిన ఘటనపై ఎస్పీ రాహుల్‌ హెగ్డే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో బాధితుల కుటుంబీకులు, అక్కడ గుమిగూడిన యువకులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎస్పీ చొరవతీసుకుని వారిని శాంతింపజేశారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖను సైతం అప్రమత్తం చేసి విద్యార్థుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
- ఎస్పీ రాహుల్‌ హెగ్డే 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా