అలస్కా యువకుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు

19 Jun, 2019 12:41 IST|Sakshi

వాషింగ్టన్‌ : డబ్బుకు ఆశపడి స్నేహితురాలిని హత్య చేసిన యువకుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. అలస్కాకు చెందిన డానియెల్‌ బ్రహ్మెర్‌(18)కు ఇండియానాకు చెందిన స్కిమిల్లర్‌(21)తో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. అయితే స్కిమిల్లర్‌ తనను తాను టైలర్‌ అనే ఓ బిలయనీర్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు బాగా డబ్బుందని బ్రహ్మెర్‌ను నమ్మించాడు. ఈ క్రమంలో వీరిద్దరు తరచుగా ఆన్‌లైన్‌ వేదికగా మాట్లాడుకునే వారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ అత్యాచారం, హత్య చేయడం వంటి అంశాల గురించి చర్చించుకున్నారు.

దీనిలో భాగంగా స్కిమిల్లర్‌.. ‘నీ బెస్ట్‌ఫ్రెండ్‌ ఎవరినైనా చంపి.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నాకు పంపించు. అలా చేస్తే.. నీకు 9 మిలియన్‌ డాలర్ల సొమ్ము(రూ. 62,69,89,500 ) చెల్లిస్తాను’ అని చెప్పాడు. డబ్బుకు ఆశపడిన బ్రహ్మెర్‌ మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత తన మిత్రబృందంలో మనోవైకల్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల సింథియా హాఫ్‌మన్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈ నెల 2న హాఫ్‌మన్‌ను వాకింగ్‌ వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్లారు బ్రహ్మెర్‌ బృందం. ఆ తర్వాత హాఫ్‌మన్‌ నోటికి టేప్‌ వేసి ఓ నది వద్దకు తీసుకెళ్లి ఆమె తల మీద కాల్చి.. నదిలో తోసేశారు.

రెండు రోజుల తర్వాత నదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలిని హాఫ్‌మన్‌గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం దర్యాప్తులో భాగంగా హాఫ్‌మన్‌ మృతదేహం దొరికిన ప్రాంతంలో సీసీటీవీ కెమరాలను పరిశీలించగా.. హాఫ్‌మాన్‌తో పాటు బ్రహ్మెర్‌ మిత్రబృందం కూడా ఉండటం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బ్రహ్మెర్‌ మొబైల్‌ని పరిశీలించగా దానిలో అతను తుపాకీతో హాఫ్‌మన్‌ను కాల్చడం.. నదిలో తోయడం.. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్కిమిల్లర్‌కు పంపడం వంటి విషయాలు వెలుగు చూశాయి. దాంతో పోలీసుల బ్రహ్మెర్‌, స్కిమిల్లర్‌తో పాటు.. అతని నలుగురు స్నేహితులను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో కోర్టు బ్రహ్మెర్‌, స్కిమిల్లర్లకు జీవిత ఖైదు విధించింది.

మరిన్ని వార్తలు