కేసుకో రేటు.. ఎస్‌ఐపై వేటు  

28 Jun, 2018 12:42 IST|Sakshi
వనపర్తి రూరల్‌ పోలీస్‌స్టేషన్, (ఇన్‌సెట్లో) ఎస్‌ఐ మశ్చేందర్‌రెడ్డి   

అవినీతి నేపథ్యంలో పోలీసుశాఖ చర్యలు

ఎస్‌బీ ద్వారా వివరాల  సేకరణ?

తాజా ఘటనతో అవినీతిపరుల  గుండెల్లో రైళ్లు

వనపర్తి క్రైం : కేసుకో రేటు చొప్పున లెక్క కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు పోలీసులు.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ తలుపు తడితే.. చేతులు తడిపే దాక వదలని జలగలు పోలీస్‌ విభాగంలో ఉన్నాయి. తమ సమస్యకు పరిష్కారం చూపుతారని భావిస్తే వాళ్తే పెద్ద సమస్యలా పరిణమిస్తున్నారు.

 వైట్‌ కాలర్‌ నేరగాళ్లకు వత్తాసు పలుకుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారు, సెటిల్‌మెంట్‌తో సంపాదిస్తున్న వారు, బెదిరించి దోచుకుంటున్న వారు, బాధితులైన ఇరువర్గాల నుంచి దండుకుంటున్న వారు పోలీస్‌శాఖలో పెరిగిపోయారు.

ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో వనపర్తి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ మశ్చేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ చర్యతో అవినీతి పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

అమాయకులపైనా కేసులు.. 

వారం పదిరోజుల క్రితం వనపర్తి మండలం చిట్యాల శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసులో అసలు సూత్రధారులను తప్పించి.. అమాయకులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

సూత్రధారులను తప్పించినందుకు భారీగానే డబ్బులు దండుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టి నిజమే అని తేలడంతో రూరల్‌ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇదే ఎస్‌ఐ తీరుపై ముందు నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో చిట్యాలలోని ఓ పాఠశాలలో విద్యార్థి తప్పిపోయాడని ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 

రోజులతరబడి సాగదీత.. 

నెలన్నర రోజుల క్రితం తిరుమలాయగుట్ట సమీపంలో ప్రేమజంటలను టార్గెట్‌ చేసి బెదిరించి నగదు దోచుకుంటున్న ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయకుండా ఫిర్యాదు వచ్చిన ఐదురోజులపాటు కాలయాపన చేశారు.

దీంతో బాధితులు ఎస్పీని ఆశ్రయించడంతో ఆలస్యంగా కేసు నమోదు చేసి తప్పని పరిస్థితుల్లో జైలుకు పంపించారు. ఈ కేసులో బాగానే ముడుపుల దండుకుని నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా ఆ సమాచారాన్ని అతడి ఉన్నతాధికారికి తెలియకుండా వ్యవహరించారు.

‘సాక్షి’ దినపత్రికలో ‘టీచోర్‌’ అంటూ కథనం రావడంతో డీఈఓ వెంటనే స్పందించి ఆయనను సస్పెండ్‌ చేశారు. ఈ కేసులోనే సదరు ఎస్‌ఐపైన వేటు తప్పదని పోలీసు శాఖలోనే పెద్ద చర్చ జరిగింది. ఎవరైనా రోడ్డుపై ప్రయాణించే వాళ్లు పొరపాటున మద్యం తాగి పట్టుబడితే ఇక అంతే సంగతులు.

కేసు రాసినప్పటికీ తనకు అనూకూలంగా ఉండే ఇద్దరు సిబ్బంది సహాయంతో బాధితుల నుంచి అందిన కాడికి దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఇవే కాకుండా సమస్యలపైన స్టేషన్‌కు వచ్చే వారితోనూ దురుసుగా ప్రవర్తిస్తూ.. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారన్న ఆరోపణలు లేకపోలేదు.

ఇదిలా ఉండగా పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తే నెలరోజుల క్రితం సైకాలజీ తరగతులకు పంపించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడం గమనార్హం. అయితే అవినీతి ఆరోపణలతో ఎస్‌ఐ సస్పెండ్‌ కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.

మరిన్ని వార్తలు