స్వలింగ సంపర్కం కేసులో మహిళ అరెస్ట్‌

4 Feb, 2019 19:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఈ తరహా ఘటనలో ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమ్మతి లేకుండా స్వలింగ సంపర్కానికి పాల్పడినందున నిందితురాలిని ఐపీసీ సెక్షన్‌ 377 కింద పోలీసులు అరెస్ట్‌ చేసి తీహార్‌ జైలుకు తరలించారు. తనను బలవంతంగా నిర్భందించిన శివానీ అనే మహిళ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.

ఢిల్లీలో పని కోసం వచ్చిన తనను రాకేష్‌, రోహిత్‌లతో పాటు మహిళ సైతం లైంగిక దాడులకు గురిచేశారని వీరిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కాకున్నా భాగస్వామి సమ్మతి లేకుండా ఈ చర్యకు పాల్పడటం నేరంగా పరిగణిస్తూ పోలీసులు నిందితురాలు శివానీని అరెస్ట్‌ చేసి కర్కర్ధుమా కోర్టులో హాజరుపరచగా ఆమెను తీహార్‌ జైలుకు జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు.

మరిన్ని వార్తలు