రూ.3 కోట్లకు రెక్కలొచ్చెనా?

23 Aug, 2018 12:41 IST|Sakshi

 ఓ ఇంట్లోభారీగా నగదు మాయం

సీసీబీ పోలీసుల అదుపులో కాంగ్రెస్‌ నాయకురాలు

సినిమా కథను మరిపించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చోరీ గాథ ఇది. ఓ బడా రాజకీయ నాయకుడు లక్ష రెండు లక్షలు కాదు, ఏకంగా రూ.3 కోట్ల క్యాష్‌ను తెలిసినవారింట్లో ఉంచాడు. ఆ ఇంటికి వచ్చిపోయే ఓ మహిళకు నగదు విషయం తెలిసింది. కొద్దిరోజులకే నగదుకు కాళ్లు వచ్చాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళ పోలీసుల అతిథిగా మారింది. అయితే ఆమె మామూలు వనిత కాదు, బెంగళూరులో కాంగ్రెస్‌ నాయకురాలు, సంఘ సేవకురాలుగా పేరున్న స్త్రీ కావడం విశేషం.  

బనశంకరి: రూ. 3 కోట్ల చోరీ ఆరోపణలపై మహిళా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు కె.టి. వీణను బుధవారం బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె సమీప బంధువులే ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీణాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చోరీకి గురైన నగదు తాజా శాసనసభ ఎన్నికల్లో గదగ్‌ నుంచి పోటీ చేసిన అనిల్‌ మెణసినకాయకు చెందినదని తెలిసింది. అనిల్‌ మెణసినకాయ తమ వద్ద ఉన్న  రూ.3 కోట్ల నగదును పరిచయస్తుల ఇంట్లో ఉంచాలని స్నేహితుడు హరిప్రసాద్‌కు సూచించాడు.  

సోదరి ఇంట్లో నగదు  
దీంతో హరిప్రసాద్‌ బెంగళూరు రాజాజీనగరలో ఉన్న తన సహోదరి సరోజా ఇంట్లో ఆ రూ.3 కోట్ల నగదును దాచిపెట్టాడు. ఈ సమయంలో సరోజా ఇంటికి ఆమె బంధువైన కేటీ.వీణా రెండుసార్లు వచ్చివెళ్లారు. సరోజా మాటల మధ్యలో ఇంట్లో ఉన్న నగదు సంగతిని కేటీ.వీణాకు తెలిపింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు మే 15 తేదీన విడుదలైన రోజున సరోజా ఇంటికి తాళం వేసుకుని బంధువులను చూడడానికి వెళ్లింది. ఈ సమయంలో కేటీ.వీణా, నటరాజ్, బాబు అనే వ్యక్తులను సరోజా ఇంటికి పంపించి నగదు చోరీకీ  పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీణాపై అనుమానం వ్యక్తం చేస్తూ సరోజా ఇటీవల రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. బుధవారం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేటీ.వీణా ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.   

మరిన్ని వార్తలు