నిజం రాబట్టేందుకు పూజలు

24 Sep, 2019 13:10 IST|Sakshi
పూజలు చేస్తున్న మంత్రగత్తె

పోలీసుల అదుపులో నిందితులు  

మీర్‌పేట: ఉంగరం దొంగిలించిందన్న అనుమానంతో నిజం రాబట్టేందుకు మంత్రగత్తెతో పూజలు చేయించిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధి జిల్లెలగూడలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడకు చెందిన నర్సమ్మ అనే మహిళ లలితానగర్‌కు చెందిన అత్తాకోడళ్లు యశోధ, మౌనిక ఇంట్లో అద్దెకు ఉంటూ వాచ్‌మెన్‌గా పనిచేస్తోంది. నెల రోజుల క్రితం మౌనికకు చెందిన ఉంగరం కనిపించకుండా పోయింది. దీంతో నర్సమ్మ ఉంగరాన్ని తీసి ఉంటుందని అనుమానంతో పలుమార్లు ఆమెను నిలదీశారు.

తాను ఉంగరాన్ని తీయలేదని చెప్పింది. దీంతో ఆమె నుంచి నిజం రాబట్టేందుకు ఇంటి యజమానులు సోమవారం ఇబ్రహీంపట్నం నుంచి ఓ మంత్రగత్తెను రప్పించారు. సదరు మంత్రగత్తెతో కలిసి సోమవారం ఉదయం నర్సమ్మ ఇంట్లోకి వెళ్లి నిమ్మకాలు, పసుపు పేర్చి పూజలు చేస్తూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై స్థానికులు  సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు నర్సమ్మ ఫిర్యాదు మేరకు యశోద, మౌనికలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మంత్రగత్తెను కూడా అదుపులోకి తీసుకుంటామని  తెలిపారు.

మరిన్ని వార్తలు