నీలవేణిది ఆత్మహత్య కాదు.. హత్య

31 May, 2020 17:10 IST|Sakshi

సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మహిళా కానిస్టేబుల్ నీలవేణి (26) మృతి కేసును పోలీసులు చేధించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం హత్యగా నిర్ధారించారు. భర్త నాగశేషు, మరిది శ్రీనివాస్ కలిసి నీలవేణిని హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లి గ్రామానికి చెందిన మద్ది నీలవేణి  కంచికచర్ల ఎక్సైజ్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అదే స్టేషన్‌లో చీమలపాడుకు చెందిన పీ నాగశేషు కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు ఏడాదిన్నర కిత్రం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు.

ఈ క్రమంలోనే నీలవేణిపై అనుమానంతో భర్త కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో భార్యను హతమార్చాలని కుట్రపన్నాడు. అదునుచూసి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తమ్ముడు శ్రీనివాస్‌ సహాయంతో భార్యను హతమార్చాడు. అనంతరం ఏమీ తెలియనట్లు భార్య ఇంట్లో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడినట్లు కథ అల్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా.. నిందితులు నిజం ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు