ప్రాణం తీసిన నిషా?

2 Jan, 2019 08:58 IST|Sakshi

నూతన సంవత్సర వేడుకల్లో యువకుడిపై దాడి

యువకుడు  మృతి

వనపర్తి క్రైం:  వనపర్తి జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి తీసుకుని ఇంట్లో వారిపై దౌర్జన్యాలకు దిగిన సంఘటనలు ఇటీవల వనపర్తి పోలీస్‌ స్టేషన్‌ వరకు వచ్చినట్లు సమాచారం. అయినా కన్నప్రేమ విషయం బయటకు పొక్కనివ్వవటం లేదు. ఈనేపథ్యంలోనే నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి యువకులు చేసుకున్న సంబరాల్లో ఓ యువకుడు మృతి చెందడానికి గంజాయి మత్తే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో సోమవారం న్యూ ఇయర్‌ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మత్తులో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది.

వనపర్తి సీఐ సూర్యానాయక్, ఎస్‌ఐ జములప్ప, రమణ తెలిపిన వివరాలు...  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి వ్యాపారం కోసం కొన్నేళ్ల క్రితం వనపర్తికి వచ్చిన దేవేందర్‌ ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనతో పాటు తమ్ముడు పుష్పెందర్‌ (28) వనపర్తిలోనే నివాసం ఉండేవాడు. పుష్పెందర్‌కు గత ఏడేళ్ల క్రితం సుజాత అలియాస్‌ రాఖితో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత వారు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ వ్యాపారంలో నష్టం వచ్చిందని మళ్లీ నలభై రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి వనపర్తికి వచ్చాడు. తన అన్నవెంట పనిచేసే యోగేష్‌తో కలిసి సోమవారం ఇంట్లోనే మద్యం సేవించిన పుష్పేందర్‌.. మిత్రుడు భానుకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సంతబజార్‌లో ఎస్పీ కార్యాలయం పక్కన తెలిసిన వ్యక్తులు సాయి, చరణ్‌ మరికొందరు కనిపిస్తే శుభాకాంక్షలు చెప్పారు.

అక్కడే ఇరువర్గాల మధ్య మునుపటి విషయాలపై ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా పుష్పేందర్‌పై సాయి, చరణ్‌తో పాటు మరికొందరు దాడి చేయగా యోగేష్‌ అడ్డుకునేందుకు యత్నించినా వారు వినకపోవడంతో పారిపోయాడు. ఆ వెంటనే విషయాన్ని పుష్పేందర్‌ అన్న దేవేందర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న దేవేందర్‌ ఎస్పీ కార్యాలయం పక్కన రోడ్డుపై పడి ఉన్న పుష్పేందర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిందని ఎస్‌ఐ జములప్ప తెలిపారు. కాగా, ఈ విషయమై సీఐ సూర్యానాయక్‌ను వివరణ కోరగా.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే అంశంపై విచారణ జరిపిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు