‘న్యాయశాస్త్రం వైపు ఆకర్షితులవడం శుభపరిణామం’

25 Oct, 2016 14:14 IST|Sakshi
‘న్యాయశాస్త్రం వైపు ఆకర్షితులవడం శుభపరిణామం’

* ​న్యాయశాస్త్ర అధ్యయనం వైపు భారతీయ యువత ఆకర్షణ ముదావహం
* వాషింగ్టన్ డీసీ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్


ఒకప్పుడు ఇంజినీరింగ్, వైద్య విద్యల వైపు ఉరకలేసిన భారతీయ యువత ప్రస్తుత తరుణంలో న్యాయవాద వృత్తి, న్యాయశాస్త్ర అధ్యయనాల పట్ల ఆకర్షితులవడం దేశ భవితకు శుభ పరిణామం అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం నాడు వర్జీనియా రాష్ట్ర యాష్‌బర్న్ నగరంలోని సితార సమావేశ మందిరంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లు సంయుక్తంగా స్థానిక ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నవరక్తం నిండిన యువతరం న్యాయవాద వృత్తి వైపు ఆకర్షితులు కావడం, మౌలిక వసతులు, జవాబుదారీతనం వృద్ధిలోకి రావడం తీర్పులను త్వరితరగతిన అందించేందుకు ఆరోగ్యకర ఆచ్ఛాదనను కల్పిస్తుందని జాస్తి పేర్కొన్నారు. ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం కలిగించినప్పుడే అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వత అడ్డుకట్ట వేయగలిగి తద్వారా దేశ సురుచిర లక్ష్యాలను అందుకునేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ప్రవాసులు మాతృదేశానికి చేస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. భారత పార్లమెంట్ ప్రజాస్వామ్యబద్ధమైన శాసనాల ద్వారా కక్షిదారులకు న్యాయం మరింత సత్వరంగా, సమర్థంగా సాంత్వన చేకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ఆ దేశ అధ్యక్షుడి ద్వారా పారదర్శకంగా నిర్వహింపబడుతున్నట్లే భారత రాజ్యాంగ వ్యవస్థ కూడా ఆ పద్ధతిని ఆకళింపు చేసుకోవాలని ఆయన సూచించారు.

పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రసంగిస్తూ ఒబామా వంటి అగ్రరాజ్య అధ్యక్షుడికి కూడా జాతిపిత మహాత్ముడే ఆదర్శమని అటువంటి దేశంలో పుట్టిన మనమంతా దానికి ఎల్లవేళలా సేవ చేస్తూ ఋణపడి ఉండాలని కోరారు. ప్రవాస తెలుగు చిన్నారులకు తెలుగు నేర్పించడం వరకు బాగానే ఉన్నా "అభ్యాసం కూసు విద్య" అనే సామెతను ప్రవాసులు మరవకూడదని అన్నారు. పిల్లలు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టేందుకు తల్లిదండృలు వారిని మాతృభాషలోనే రాయడం, పలకడం, మాట్లాడటం వంటి వాటి వైపు ప్రోత్సహించవల్సిందిగా సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆంగ్ల భాష వ్యాప్తి మర్రిచెట్టును తలిపిస్తుండంపై ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు దంగేటి కిషోర్, ఉపాధ్యక్షుడు మన్నే సత్యనారాయణ, ప్రవాస ప్రముఖులు డాక్టర్ యడ్ల హేమప్రసాద్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, డాక్టర్.నరేన్ కొడాలి, ఏపీ ఎన్.ఆర్.టీ ప్రతినిధి కలపటపు బుచ్చిరాంప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు డా.నరిశెట్టి ఇన్నయ్య, కోయా రమాకాంత్, కుక్కట్ల శ్రీనివాస్, ఉప్పుటూరి రాంచౌదరి, మేరీల్యాండ్ తెలుగు సంఘం, తెలంగాణా అభివృద్ధి మండలి(టీడీఎఫ్) ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు