రజనీకాంత్‌ 'లాల్‌ సలామ్‌'లో జీవిత రాజశేఖర్‌ రోల్‌ ఇదే.. ప్రత్యేక పాత్రలో కపిల్

24 Nov, 2023 09:06 IST|Sakshi

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.

లాల్‌ సలామ్‌లో జీవిత రాజశేఖర్‌ పాత్ర ఇదే
డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్‌ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్‌ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌తో పాటు జీవిత రాజశేఖర్‌ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్‌ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది.

రజనీకాంత్ కూడా గతంలో కపిల్‌ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్‌తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్‌ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన ఫొటోను కపిల్‌ కూడా  పోస్ట్‌ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్‌ సలామ్‌' టీజర్‌ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు.

మరిన్ని వార్తలు