అబ్దుల్‌కలాం విగ్రహావిష్కరణలో హైడ్రామా

27 Jul, 2016 23:24 IST|Sakshi
kalam
 
కంభం :  
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ త్రివిక్రంవర్మ
 అధికార పార్టీ నేతల తీరుతో మధ్యలోనే వెనుదిరిగిన వైనం
  స్థానిక ఎమ్మెల్యే–మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదమే కారణం
 
మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్‌కలాం వర్ధంతి సందర్భంగా కంభంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ త్రివిక్రంవర్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే–మాజీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాల కారణంగా తలెత్తిన ప్రొటోకాల్‌ సమస్య, ఫిర్యాదులతో విగ్రహావిష్కరణలో హైడ్రామా నడిచింది. దీంతో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఎస్పీ త్రివిక్రంవర్మ మధ్యలో వెనుదిరిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 
 
కంభం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు సయ్యద్‌జాకీర్‌ ఆధ్వర్యంలో అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం కలాం వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథిగా ఎస్పీ త్రివిక్రంవర్మ, విశిష్ట అతిథిగా గిద్దలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా వెంకటరాంబాబులను ఆహ్వానించారు. ఆ మేరకు శిలాఫలకం వేయించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి భారీగా 1500 మంది వరకూ విద్యార్థులు హాజరయ్యారు. మరికాసేపట్లో ఎస్పీ చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారనగా, ఉదయం 10.45 గంటల సమయంలో అనూహ్యంగా హైడ్రామా మొదలైంది. విగ్రహావిష్కరణ శిలాఫలకంపై ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన తన పేరు లేకుండా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు ఉండటంపై ముత్తుముల అశోక్‌రెడ్డి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సుబ్బారావుకు గుంటూరు ఆర్‌జేడీ ఫోన్‌చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎస్పీకి ప్రిన్సిపాల్‌ ఆ విషయం చెప్పడంతో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించకుండా కేవలం చిత్రపటానికి పూలమాలవేసి విగ్రహం ఎదురుగా ఓ కొబ్బరిమెుక్కను ఎస్పీ నాటారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడి వెనుదిరిగారు. 
 
చదువుకు పేదరికం అడ్డుకాదు : ఎస్పీ
చదువుకు పేదరికం అడ్డుకాదని, పట్టుదలతో చదివితే ప్రతిఒక్కరూ ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని ఎస్పీ త్రివిక్రంవర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందుకు అబ్దుల్‌కలాం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థీ ఇండియా 20–20 పుస్తకాన్ని కచ్చితంగా చదవాలని సూచించారు. 2020లో ఇండియా ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించి 1998లోనే ఆ పుస్తకాన్ని రచించిన గొప్ప తాత్వికవేత్త కలాం అని కొనియాడారు. ప్రతి విద్యార్థికీ ఒక ఆశయం ఉండాలని చెప్పారు. దాని సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. సాధారణ స్థాయి నుంచి అత్యున్నత భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన కలాంను ఆదర్శనంగా తీసుకోవాలన్నారు. అనంతరం కలాం జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు.
 
ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం తగదు : అన్నా రాంబాబు
ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే ముత్తుములను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ పేరుతో జిల్లా అధికారి చేతులమీదుగా జరగాల్సిన కలాం విగ్రహావిష్కరణను నిలిపివేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సభా వేదికపైకి వెళ్లకుండా ఎదురుగా విద్యార్థులతో కలిసి ఆయన కూర్చుని అసహనం వ్యక్తం చేశారు.
 
కమిటీ సభ్యులచే కలాం విగ్రహావిష్కరణ...
అతిథులంతా వెళ్లిపోయిన తర్వాత చివరకు విగ్రహ కమిటీ సభ్యులే కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సుబ్బారావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.విక్టోరియా మహారాణి, పర్చూరు, కారంచేడు, కొత్తపట్నం, ఎస్‌ఎన్‌ పాడు, కందుకూరు జెడ్పీటీసీ సభ్యులు ఉషారాణి, నాగజ్యోతి, విజయ, టి.శ్రీను, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు