జీవితాంతం నటిస్తూనే ఉంటా

25 Feb, 2017 21:11 IST|Sakshi
జీవితాంతం నటిస్తూనే ఉంటా

‘సాక్షి’తో  సినీ నటుడు కోట శంకరరావు  

ఒంగోలు కల్చరల్‌:  నాటకరంగంతో ప్రస్థానం ప్రారంభించి సినీ, టీవీ రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్న ప్రతిభావంతులైన వెండితెర వేల్పులలో కోట శంకరరావు ఒకరు. కృష్ణా జిల్లా కంకి పాడుకు చెందిన శంకరరావు కళారంగంపై మక్కువతో ఎస్‌బిఐలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి పూర్తిస్థాయి కళాకారుడిగా, నటుడిగా సినీనాటకరంగాలతోపాటు టెలివిజన్‌ రంగంలో రాణిస్తూ తనదైన ఒక శైలిని సృష్టించుకున్నారు. నిర్మాతలు డబ్బు  కోసమే అశ్లీలతతోకూడిన , హింసను ప్రేరేపించే విధంగా సినిమాలు, సీరియల్స్‌ తీస్తున్నారని అది కళాసేవ ఎంత మాత్రం కాదని ఆయన అన్నారు.  ఇందుకు రచయితలను తప్పు పట్టడం సరికాదనేది ఆయన అభిప్రాయం. ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ కళార్చన కార్యక్రమాలలో భాగంగా మినిస్టర్‌ నాటక ప్రదర్శనకు దర్శకత్వం వహించేందుకు కోట శంకరరావు సోమవారం ఒంగోలుకు వచ్చారు. ఈ సందర్భంగా  ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  

35 ఏళ్ల కిందటే నటనకు శ్రీకారం  
కంకిపాడుకు చెందిన కోట శంకరరావు ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావుకు సోదరుడు. కంకిపాడులో గౌరీశంకర ఆర్ట్‌ థియేటర్‌ పక్షాన శంకరరావు, శ్రీనివాసరావు తదితరులు నాటకాలు ఆడేవారు. ప్రస్తుతం మీడియా క్రియేషన్స్‌ అనే సంస్థ«ను స్థాపించి దాని తరఫున నాటక ప్రదర్శనలిస్తున్నారు శంకరరావు .  

కళాభిమానంతో ఉద్యోగానికి స్వస్తి
నాటకాలతోపాటు టీవీ, సినిమాలలో శంకరరావుకు వచ్చే అవకాశాలు పెరగడంతో ఆయన   ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఉద్యోగం మానేస్తే బతుకు బండి నడిచేదెలా అని చాలా కాలం ఆలోచించి చివరకు ఆ ఉద్యోగం మానేసినా తనకు నష్టం ఏమీలేదనే నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టారు.  

ఊపిరి ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటా  
‘కళారంగం నా ఊపిరి. ఊపిరి ఉన్నంత వరకు సినిమాలలో, నాటకాలలో నటిస్తూనే ఉంటా’ అంటూ తన జీవితాశయాన్ని కోట శంకరరావు వ్యక్తీకరించారు.  

ప్రోత్సాహం..  
శంకరరావుకు గుంటూరు శాస్త్రి వంటి కళా    సహృదయుల ప్రోత్సాహం లభించింది. ఉషశ్రీ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వంటి వారి సహకారం తోడైంది. రేడియో నాటికలు, నాటకాలలో కూడా ఆయన పాల్గొన్నారు.  

వంద సినిమాలు  
శంకరరావు సినిమాలలో సెంచరీ పూర్తి చేశారు. సూత్రధారులు, పల్నాటి పౌరుషం, అంకురం, చీమల దండు వంటి పలు సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. హిందీలో ఏక్‌తా సినిమాలో నటించారు. తమిళంలో కూడా ఆయనకు అవకాశాలు వచ్చాయి.  

నాటకరంగంలో  
గత 35 సంవత్సరాలుగా నాటకరంగంతో తన అనుబంధాన్ని శంకరరావు కొనసాగిస్తూనే ఉన్నారు. 1981లో నాగులు తిరిగే కోన నాటకంలో ఆయన నటించారు. ఆ నాటకంతోపాటు రసరాజ్యం నాటకం నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశాన్ని ఆయనకు కల్పించింది.  

టీవీ సీరియల్స్‌లో  
పలు టీవీ ఛానెల్స్‌లో 64 మెగా సీరియల్స్‌లో కోట శంకరరావు వైవి«ధ్యభరితమైన పాత్రలు పోషించారు. శ్రీమతి, గంగోత్రి, గాయత్రి, సప్తపది, అమ్మ, అక్కాచెల్లెళ్లు, కలిసుందాం, విశ్వామిత్ర, యోగి వేమన వంటి సీరియళ్లు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆకాశవాణి, టెలివిజన్‌ సంస్థలు గ్రేడ్‌–1 కళాకారునిగా ఆయనకు గుర్తింపునిచ్చాయి.  

పొందిన పురస్కారాలు..
శంకరరావు మూడు సార్లు నంది పురస్కారాన్ని అందుకున్నారు. దీనితోపాటు 2014లో అకాడమీ ఆఫ్‌ యూనివర్సిల్‌ గ్లోబల్‌  పీస్‌ పురస్కారాన్ని బెంగళూరులో అందుకున్నారు. పలు సినీనాటకరంగ కళా సంస్థలు శంకరరావును ఘనంగా సన్మానించాయి.  

పరభాషా నటులకే ప్రోత్సాహం..
నేడు తెలుగులో ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు ఉన్నప్పటికీ వారిని ఉపయోగించుకోకుండా బయటి ప్రాంతాల నుంచి విలన్లను, ఇతర నటులను నిర్మాతలు తెస్తుండడాన్ని ఆయన ఆక్షేపించారు.  

ఇంటిల్లిపాది కూర్చుని చూసే సినిమాలేవీ..?
నేడు కుటుంబ సభ్యులతో కూర్చుని చూడగలిగే సినిమాలు, సీరియళ్లు తక్కువ. నేడు అశ్లీలంతో, హింసతో, ద్వంద్వార్థాలతో కూడిన సినిమాల ను, సీరియళ్లను తీసే  నిర్మాత, దర్శకులు ముందు   కుటుంబ సభ్యులతో, సంతానంతో వాటిని కలసి చూడగలరేమో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆత్మపరిశీలన  చేసుకోవాలి. విలువలను కాపాడేందుకు కృషి చేయాలి. 

మరిన్ని వార్తలు