అంగట్లో ఆధార్‌

20 Oct, 2016 18:26 IST|Sakshi
అంగట్లో ఆధార్‌
* ఆన్‌లైన్‌లో ‘ఆధార్‌’ చౌర్యం
* సాంకేతిక సాయంతో ఫొటోలు మారుస్తున్న వైనం
* అధికారుల నిర్లక్ష్యంతోనే గోప్యత బట్టబయలు
 
ఆధార్‌ కార్డు.. ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ ఇదే ఆధారం. వంటిట్లో గ్యాస్‌ నుంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు వరకు ఆధార్‌ నంబరుతోనే అనుసంధానమై ఉన్నాయి. ఆధార్‌ నంబర్‌ విషయంలో గోప్యత ఎంతో  అవసరం. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మనకు తెలియకుండా ఆధార్‌ కార్డును దొంగిలించేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో కార్డులోని ఫొటోలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. 
 
గుంటూరు (నగరంపాలెం): కార్డుదారుని ప్రమేయం లేకుండానే ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసేస్తున్నారు. వీటిని కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల రవాణా శాఖలో ఒకరి వాహనం యాజమాన్యం హక్కులు మార్చటం కోసం అతనికి తెలియకుండానే ఆధార్‌ కార్డును సంపాదించి పెద్ద మొత్తంలో రుణం పొందాడు. ప్రస్తుతం స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో కూడా చాలా మంది ఆధార్‌ కార్డులు వారికి తెలియకుండానే వేరే వాటికి అనుసంధానం జరిగినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత గుర్తింపు కార్డుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ యూనిక్‌ ఐడీ ఏర్పాటు నిమిత్తం ఆధార్‌ కార్డు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దీని ద్వారా సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌lసర్వర్‌లో అప్‌లోడ్‌ చేసింది. రాష్ట్రాలకు వెరిఫికేషన్‌ కోసం స్టేట్‌ రెసిడెన్షియల్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డీహెచ్‌) వెబ్‌ సైట్‌ను రూపొందించి ఆన్‌లైన్‌ సర్వర్‌ను దీనికి లింక్‌ చేసింది. ఈ వెబ్‌సైట్‌కు ప్రత్యేక లాగిన్‌ పాస్‌వర్డు ద్వారా మాత్రమే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని వ్యక్తి ఆధార్‌ కార్డు వివరాలనైనా తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రభుత్వ శాఖల్లో అందించే సేవలకు ఆధార్‌ కార్డు అనుసంధానం చేసినప్పటి నుంచి కార్యాలయంలోని గజిటెడ్‌ ర్యాంక్‌ అధికారులకు రెండేళ్ల క్రితం ఎస్‌ఆర్‌డీహెచ్‌ లాగిన్‌లు అందజేశారు.
 
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి లాగిన్‌ పాస్‌వర్డ్‌లు..
ప్రభుత్వ కార్యాలయంలో సేవలు పొందుటకు అందించిన ఆధార్‌ కార్డు కాపీ సరైనదా ? కాదా ? తెలుసుకునేందుకు అధికారులు ఎస్‌ఆర్‌డీహెచ్‌ వెబ్‌సైట్‌కు లాగినై వివరాలు సరిపోల్చుకుంటారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు వినియోగిస్తున్న అన్ని సేవలకు ఆధార్‌ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గతంలో జారీ చేసిన ఓటరు కార్డులు, రేషన్‌ కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్, మీటర్లు, భూమి రికార్డులకు ఆధార్‌ అనుసంధానం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలంలో వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేసింది. దీనికి ప్రజల నుంచి స్పందన లేకపోవటంతో  సేవలు పొందుతున్న వారి ఆధార్‌ కార్డుల నంబర్లు ఎస్‌ఆర్‌డీహెచ్‌ సైట్‌కు లాగినై తెలుసుకున్నారు. దీని కోసం  కార్యాలయంలోని క్షేత్రస్థాయి సిబ్బందికి, కొంత మంది ప్రైవేటు వ్యక్తులను ఎస్‌ఆర్‌డీహెచ్‌ లాగిన్‌లు, పాస్‌వర్డులు అందించి ఆధార్‌ వివరాలను సెర్చ్‌ చేయించారు. ఈ విధంగా లాగిన్, పాస్‌వర్డులు ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వారి ద్వారా డీటీపీ, ఇంటర్‌నెట్, రిజిస్ట్రేషన్, ఆర్‌టీవో తదితర కార్యాలయాల వద్ద ఏజెంట్లకు చేరాయి. వీరు కార్డు నంబరు తెలిసినా, వ్యక్తి పేరు తెలిసినా అనధికారికంగా లాగినై  కార్డులు డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. కొంత మంది ఫొటోషాప్‌ సహాయంతో వాటిలో ఫొటోలు, వివరాలు సైతం మార్చి మోసాలకు పాల్పడుతున్నారు. రెండేళ్ల క్రితం లాగిన్‌లు, పాస్‌వర్డులు ఇప్పటికీ మార్చకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.   
 
ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్లతో డౌన్‌లోడ్‌..
ఆధార్‌కార్డు డౌన్‌ లోడ్‌ చేయాలంటే ఎన్‌రోల్‌మెంట్‌ నంబరు (వివరాలు అందించినప్పుడు కేటాయించింది) కావాలి. వ్యక్తి పేరు, ప్రాంతం , ఆధార్‌ నంబరు తెలిస్తే ఎస్‌ఆర్‌డీహెచ్‌ సైట్‌ ద్వారా ఎన్‌రోల్‌మెంట్‌ నంబరు తెలుసుకుంటున్నారు. దీని ద్వారా యూఐడీఏ గెట్‌ ఆధార్‌ సైట్‌లో కార్డులను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. కార్డు డౌన్‌లోడ్‌కు రూ.100, కార్డు సెర్చింగ్‌కు రూ.200 నుంచి 500 వరకు అవసరాన్ని బట్టి వసులూ చేస్తున్నారు. ఫోన్‌ నంబరు రిజిస్టరయిన కార్డులు మాత్రమే ఆధార్‌ నంబరుతో డౌన్‌లోడ్‌ చేసే అవకాశముంది. మిగిలిన ఆధారు కార్డులన్నీ ఎన్‌రోల్‌మెంట్‌ నంబరు ద్వారానే డౌన్‌ లోడ్‌ చేయాల్సిందే.. 
మరిన్ని వార్తలు