అట్లూరు సొసైటీ..అక్రమాల పుట్ట

15 Jul, 2016 03:37 IST|Sakshi

తీగలాగితే డొంక కదిలింది!
సహకార శాఖ అధికారుల నివేదికలో బట్టబయలు
ఒకే రోజు కొత్తగా 931 మందికి సభ్యత్వం జారీ
కొత్త సభ్యులందరికీ రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు
ఎండు మిరప పేరుతో దోపిడీకి సన్నద్ధం
సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సులు

సాక్షి ప్రతినిధి, కడప : ‘తీగలాగితే డొంక కదిలింది’ అన్నట్లుగా అట్లూరు సొసైటీ అక్రమాలు తెరపైకి వచ్చాయి. అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో డీసీసీబ్యాంకు డొల్లతనం బహిర్గతమైంది. సహకారశాఖ యాక్ట్‌కు వ్యతిరేకంగా నిధులు కేటాయింపు, ఆపై రుణాలు మంజూరుకు సన్నద్ధం కావడమేనని విచారణ అధికారుల నివేదిక బట్టబయలు చేసింది. రుణాలు కోసమే కొత్తగా సభ్యులు చేర్పించడం, ఒకే రోజులో 931మందికి సభ్యత్వం కల్పించడం, ఆపై ఎండుమిరప పేరుతో కొల్లగొట్టేందుకు సన్నహాలు చేసినట్లు నిగ్గుతేల్చారు. నష్టాల ఊబిలో ఉన్న సొసైటీకి రెండునెలల వ్యవధిలో రూ.14కోట్లు నిధులు కేటాయించడంలో మతలబు తెలిసిపోయింది.

అర్హతలేని సొసైటీకి రూ.14కోట్ల నిధులు
ముందే నష్టాల ఊబిలో కూరుకుపోయి, రుణాలు ఇచ్చేందుకే అర్హతలేని సొసైటీకి రెండునెలల వ్యవధిలో దాదాపు రూ. 14కోట్లు నిధులు మంజూరు చేశారు. అక్రమాలకు నిలయంగా మారిన సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా డీసీసీ బ్యాంకు ఫండ్ కేటాయించింది. ఈ మొ త్తం వ్యవహారంలో పాలకవర్గం, సంఘం సిబ్బంది, డీసీసీబీలదే పూర్తి బాధ్యతగా నిర్ధారించింది. ఈనెల 4న ‘దోపిడీకి సహకారం!’ అంటూ సాక్షి కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టాల్సిందిగా డీసీఓ సుబ్బారావు అధికారులను ఆదేశించారు. ఆమేరకు విచారణ జరిపిన రాజంపేట డీఎల్‌సీఓ గుర్రప్ప డీసీసీబీ సీఈఓకు తాజాగా నివేదిక సమర్పించారు.

విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. ఇదివరకే రూ.2,26,63,255 నష్టంలో అట్లూరు సొసైటీ ఉంది. 2014-15లో అదనంగా రూ.35,64,398 నికర నష్టం చవిచూసింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, కడపకు చెల్లించిన అప్పునకు సభ్యుల నుంచి వసూళ్లు కావాల్సిన రుణాలకు మధ్య రూ.2,26,08,499 వ్యత్యాసం ఉంది. అంతటి విపత్కర పరి స్థితిలో అట్లూరు సొసైటీ ఉంది. అయినప్పటీకీ 2015-16 రబీ సీజన్‌లో 650 మందికి రూ.5.77కోట్ల రుణాలు చెల్లిం చారు. రెండునెలల వ్యవధిలో 931మంది సభ్యులకు రూ. 8.22 కోట్లు మంజూరు చేశారు. సరైన ఆర్థిక పరపతి లేని సంఘానికి రూ.13, 98,86,000 మంజూరుచేయడంపై డీసీసీ బ్యాంకు వైఖరిని విచారణ అధికారులు తప్పుబట్టారు.

ఎండుమిరప పేరుతో దోపిడీకి సన్నద్ధం
ఎండుమిరప పంట అట్లూరు మండలంలో సాగులోనే లేదు. ఆ పంట పేరుతో సొసైటీ పరిధిలో రుణాలు కొల్లగొట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఎండుమిరపకు రూ.1లక్ష పంటరుణం ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా 931 మంది ఎండుమిరప వేసినట్లుగా రికార్డులు పొందుపర్చి రుణాలు పంచేందుకు సొసైటీ సిబ్బంది పావులు కదిపారు. సహకారశాఖ యాక్టు ప్రకారం ముం దుగా సంఘంలో ఉన్న సభ్యులకు రుణా లు ఇచ్చాక కొత్తగా చేరిన సభ్యులకు అవకాశం కల్పించాలి. అట్లూరు సొసైటీ పరిధిలో ఇలాంటి నిబంధనలను పక్కనపెట్టారు. ఇదివరకే 7,466 మంది సభ్యులున్నారు. వారందరికీ రుణాలు మంజూరు కాలేదు.

అది అటుంచితే కొత్తగా చేరిన 931మంది సభ్యులకు ఎండుమిరప పంట రుణం పేరుతో రూ.8,21, 68,000 ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఒక్కరోజులోనే 931 మందికి సభ్యత్వం సైతం ఇచ్చారు. వీరి నుంచి సెక్షన్ 19(1)(సీ), రూల్ 14(2)ననుసరించి సభ్యత్వ దరఖాస్తులు, భూమి వివరాలు తెలుపు పత్రాలు సంఘానికి సమర్పించలేదు. రుణాలు పేరుతో దోపిడీ చేసే క్రమంలో రికార్డు పరంగా ఈ ప్రక్రియను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం స్వాహా ఎత్తుగడ. ఇందులో డీసీసీబీ పాత్ర సైతం నిర్ధారణ అయ్యింది.

డీకేటీలకు సైతం..
జీఓ255 ప్రకారం సహకార సంఘాల్లో డీకేటీ భూములకు రుణ సౌకర్యం 1999కి పరిమితి చేశారు. అయినప్పటికీ అట్లూరు సొసైటీ డీకేటీ భూముల కు రుణాలిచ్చింది. ఇదివరకే కలివి కోడి ఆవాస ప్రాంతంగా గుర్తింపుపొం దడం, సోమశిల బ్యాక్‌వాటర్ మునకప్రాంతంగా పరిహారం పొందారు. మండలపరిధిలో భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో భూ మి లేకపోయినా డీకేటీ పట్టాలు రికార్డులు నకిలీవి రూపొందించి రుణాలు కొల్లగొట్టే ఎత్తుగడలను ఎంచుకున్న ట్లు తెలుస్తోంది. సహకారయాక్టు సెక్ష న్ 19(1)(సీ), సెక్షన్ 36(1), రూల్ 14(2)లకు విరుద్ధంగా అట్లూరు సొసై టీ పరిధిలో లావాదేవిలు నిర్వహిం చారు. అందుకు పూర్తి బాధ్యత పాలకవర్గం, సిబ్బంది, డీసీసీ బ్యాంకుదేనని నివేదిక ఇచ్చారు. సిబ్బందిపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలకు సైతం సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు