ఎసరు

25 Jul, 2016 22:56 IST|Sakshi
ఎసరు
మచిలీపట్నం : పోర్టు, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పేరుతో 36వేల ఎకరాలను మచిలీపట్నంలో సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూసమీకరణ కోసం నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధం చేస్తుండడంతో ఎవరి భూములు పోతాయనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. రైతులు అంగీకరిస్తేనే భూ సమీకరణ అయినాl, భూసేకరణ అయినా ముందడుగు వేస్తుందని, రైతుల నిర్ణయంపైనే అన్నీ ఆధారపడి ఉంటాయనే వాదన వినిపిస్తోంది.
ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ ...
 భూ సమీకరణలో తొలివిడతగా పోర్టు నిర్మాణం జరిగే చిలకలపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 4,636 ఎకరాలకు సమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రాత్రి వరకు కసరత్తు జరుగుతూనే ఉంది. ఎనిమిది మంది రెవెన్యూ సిబ్బంది గతంలో ఈ ఆరు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ కోసం జారీ చేసిన భూములను భూసమీకరణలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నారు. 
జేసీ గంధం చంద్రుడు సోమవారమే భూసమీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పినా భూముల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాకపోవడంతో మంగళవారం నోటిఫికేషన్‌ జారీ అవుతుందని రెవెన్యూ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. భూసమీకరణ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మచిలీపట్నం ఆర్డీవో పి సాయిబాబు విజయవాడ తీసుకువెళ్లడంతో ఏ క్షణంలోనైనా భూసమీకరణ నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.  9(1) ద్వారా భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తొలివిడత సమీకరించే ఆరు గ్రామాల్లో 2,282 ఎకరాల పట్టాభూమి, 413 ఎకరాల అసైన్డ్‌భూమి, 1941 ఎకరాల ప్రభుత్వభూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
భూసేకరణ గడువు ముగిసే సమయంలో :
గత ఏడాది ఆగస్టు 31వ తేదీన పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో 30 వేల ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మరో నెల రోజుల వ్యవధిలో ఈ నోటిఫికేషన్‌ గడువు పూర్తవుతుంది. ఇంతకాలం పోర్టుకు అవసరమైన భూమిని సేకరించకుండా ప్రభుత్వం మిన్నకుండిపోయింది. 
భూసేకరణ నోటిఫికేషన్‌ గడువు ముగిసే సమయంలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ)ను తెరపైకి తెచ్చి అభివృద్ధి పేరుతో భూసమీకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 భూసమీకరణ ప్రక్రియకు కనీసం ఏడాది సమయం పడుతుంది. భూసేకరణ, భూసమీకరణ చట్టాల్లోని అసలు అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా ఒకసారి భూసేకరణ, మరోసారి భూసమీకరణ అంటూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీతో రైతుల్లో అయోమయం నెలకొంది.
రైతులు అంగీకార పత్రాలు ఇస్తేనే ....
  పోర్టు, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పేరుతో 36 వేల ఎకరాలకు పైగా మచిలీపట్నంలో సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసినా 80 శాతం మందికి పైగా రైతులు తమ భూములను ఇస్తామని అంగీకారపత్రాలు ఇస్తేనే భూ సమీకరణకు ప్రభుత్వం ముందడుగు వేసేందుకు అవకాశం ఉంటుందని, రైతులు అంగీకరించకుంటే
 ఈ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులే అంటున్నారు. గతంలో మచిలీపట్నం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిన ప్రభుత్వం అనంతరం ఈ జీవోను ఉపసంహరించుకుంది. 
వ్యూహాత్మకంగా వ్యవహరించారా :
పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం భూములను సేకరించేందుకు గత ఏడాది భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో రైతులకు పంట రుణాలు నిలిచిపోయాయి. భూమిని విక్రయించకుండా  రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. సాగునీరు సకాలంలో విడుదల చేయకుండా ఇబ్బందుల పాలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు రూ.15 లక్షలు, రూ. 20 లక్షలకు తమ భూములను మంత్రుల అనుచరులకు విక్రయించినట్లు అంగీకార ‡పత్రాలు రాసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ అయిన అనంతరం ఈ విధంగా కొన్న భూములను పోర్టు నిర్మాణానికి ఇస్తామని రైతులు ప్రకటనలు చేసే అవకాశం ఉందనే వాదన ఉంది. అయితే భూసేకరణ లేదా సమీకరణ చట్టం ప్రకారం ఈ అంగీకార పత్రాలు చెల్లవని, వాస్తవంగా సాగులో ఉన్న రైతులే తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంది.
 
 

 

మరిన్ని వార్తలు