నిరాశే!

15 Mar, 2016 02:55 IST|Sakshi

పాలమూరు -రంగారెడ్డికి భారీగా కేటాయింపులు డిండికి అత్తెసరు నిధులు..  ఇక జిల్లాలో చిన్న నీటిపారుదల ప్రాజెక్టులయిన లక్నాపూర్, శివసాగర్ ప్రాజెక్టులకు కొత్త కేటాయింపులు చేయలేదు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్న 199 గ్రామాలకు తాగునీటిని అందించే బాధ్యతను జలమండలికి అప్పగించారు. 

ఇది సంక్షేమ బడ్జెట్..
ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమానికి, పారిశ్రామిక అభివృద్ధికి దిక్సూచి. సంక్షేమానికి రూ.13,412 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ. 4,815 కోట్లు కేటాయించడం ఇందుకు నిదర్శనం. పారిశ్రామిక, సాగునీటి పారుదల రంగాలకు మంచి కేటాయింపులు జరిగాయి. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా  ఉపాధి మెరుగుపడుతుంది.         - మహేందర్ రెడ్డి, మంత్రి

 రైతుల పట్ల చిత్తశుద్ధి ఏదీ..?
రైతులకు రూ.7 వేల కోట్లు కేటాయించలేదంటే ప్రభుత్వానికి అన్నదాతలపై ఉన్న చిత్తశుద్ధి ఇట్టే అర్థమవుతుంది. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల హామీతో ఓట్లు వేయించుకుని గెలిచిన ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం మొండిచేయి చూపింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలలో జిల్లాకు నీరందించే ప్రాంతంలో చేపట్టే పనులకు ఎలాంటి టెండర్లూ పిలవలేదు. - రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే మిగిలింది. పాలమూరు- రంగారెడ్డికి భారీగా నిధులు కేటాయించిన సర్కారు.. డిండి నుంచి ఇబ్రహీంపట్నంకు కృష్ణాజలాలను తర లింపునకు అత్తెసరు నిధులు విదిల్చింది. శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి కృష్ణాజలాలను తీసుకురావడం ద్వారా నై విచ్చుకున్న జిల్లాలను నేలలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి  తెలిసిందే. దీంట్లో భాగంగా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేసింది. రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్  (7లక్షల ఎకరాలు), రంగారెడ్డి (2.70 లక్షలు), నల్లగొండ (30 వేలు) ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పాలమూరు -రంగారెడ్డికి రూ.7,860.88 కోట్లు కేటాయించింది.

అయితే ఈ నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల 18 ప్యాకేజీలకు టెండర్లను ఖరారు చేసిన ప్రభుత్వం.. దీంట్లో మన జిల్లాకు సంబంధించి ఒక్క ప్యాకేజీని కూడా పొందుపరచలేదు. మహబూబ్‌నగర్ జిల్లా కేపీ లక్ష్మిదేవుపల్లి నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు, తాగు నీరందించేలా ప్రాజెక్టుకు డిజైన్ చేసిన సర్కారు.. ఈ ప్యాకేజీలకు సంబంధించి సర్వే ప్రక్రియ కూడా మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలో తాజా కేటాయింపులు కూడా పొరుగు జిల్లాకే పరిమితం కానున్నాయి. తాజా బడ్జెట్ కేటాయింపులను విశ్లేషిస్తే పాలమూరు దాటి జిల్లా దరికి కృష్ణమ్మ చేరాలంటే మరికొన్నాళ్లు వే చిచూడాల్సిందే!

డిండికి రూ.780 కోట్లు!
కరువు నేలల్లో హరితసిరులు పండించేందుకు దోహదపడుతుందని భావించిన డిండి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో మోస్తరు నిధులు కేటాయించారు. ఎదుల రిజ ర్వాయర్ నుంచి 22.47 టీఎంసీల సామర్థ్యం కృష్ణాజలాలను దేవరకొండ, క ల్వకుర్తి, మునుగోడు మీదుగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు తరలించాలని నిర్ణయించింది. మార్గమధ్యంలో రిజర్వాయర్లు, పైప్‌లన్లు, కాల్వల నిర్మాణానికిగాను రూ.7వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే శివన్నగూడ రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల కు 5 టీఎంసీలను తరలించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. మరో నాలుగువారాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఖరారు చేసి టెండర్లు పిలుస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం అంతంతమాత్రంగానే చేసింది. కేవలం రూ.780 కోట్లు మాత్రమే విదిల్చి చేతులు దులుపుకుంది. ఈ కేటాయింపులను పరిశీలిస్తే చివరి ఆయకట్టు ప్రాంతమైన మన జిల్లాకు నీరు రావాలంటే కనీసం ఆరేళ్లయినా పట్టే అవకాశంలేకపోలేదు. ఇక జిల్లాలో చిన్న నీటిపారుదల ప్రాజెక్టులయిన లక్నాపూర్, శివసాగర్ ప్రాజెక్టులకు కొత్త కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. ఇక కోట్‌పల్లికి రూ.2.30 కోట్లు కేటాయించారు.

మిషన్ కాకతీయకు పెద్దపీట
మిషన్ కాకతీయకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది రెండో దశ కింద చెరువుల పునరుద్ధర ణకు దాదాపు రూ.300 కోట్లు నిర్ధేశించింది. తద్వారా జిల్లావ్యాప్తంగా 560 చెరువులను బాగు చేయనుంది. కూరగాయల సాగు, ఉద్యానవనాల పెంపకాన్ని ప్రోత్సహించాలని భావించిన ప్రభుత్వం... సూక్ష్మ, బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌ల కల్టివేషన్‌కు సబ్సిడీ పరిమితి పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.

జలమండలిలోకి ఔటర్ గ్రామాలు
ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు ఇక జలమండలి తాగు నీటిని సరఫరా చేయనుంది. 199 గ్రామాలకు తాగునీటిని అందించే బాధ్యతను జలమండలికి అప్పగిస్తూ బడ్జెట్‌లో పొందుపరిచింది. పారిశ్రామిక విస్తర ణ, ఐటీ సంస్థల తాకిడిని ప్రత్యేకంగా ప్రస్తావించిన విత్తమంత్రి ఫార్మాసిటీ రాకతో రంగారెడ్డి జిల్లా దశ మారనుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు