రామాలయం వాచ్‌మన్‌కు రూ.5 లక్షలు

10 May, 2016 04:25 IST|Sakshi

- మనవరాలి చికిత్సకు సాయమందించిన సీఎం

సాక్షి, హైదరాబాద్: శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో పని చేసే ఓ తాత్కాలిక ఉద్యోగి మనవరాలి వైద్యానికి అయ్యే ఖర్చులకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఫిబ్రవరి 16న సీఎం సందర్శించారు. ఆ సమయంలో అక్కడ వాచ్‌మన్‌గా పని చేస్తున్న షేక్ మస్తాన్ సీఎంకు తన గోడు వినిపించాడు.

 

ఆ సందర్భంలో మస్తాన్ తన మనవరాలు షేక్ సహారీ బేగం దుస్థితి వివరించాడు. ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతోందని, తండ్రి చనిపోవటంతో తన వద్దే ఉంటోందని, ఆమెకు వైద్యం చేయించే స్తోమత తనకు లేదని మస్తాన్ సీఎంకు చెప్పాడు. దీంతో చలించిన సీఎం ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులపై సీఎంవో అధికారుల ద్వారా ఆరా తీయించారు. వైద్య ఖర్చులు  రూ.5 లక్షలు అవుతాయని తేలడంతో ఆ మొత్తాన్ని విడుదల చేశారు. సంబంధిత చెక్కును సీఎంవో అధికారులు సోమవారం మస్తాన్‌కు అందించారు.

మరిన్ని వార్తలు