వసూళ్ల పర్వం

18 Aug, 2016 02:14 IST|Sakshi
వసూళ్ల పర్వం
  • అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు
  • డాక్యుమెంట్‌ రైటర్‌లే అక్రమ వసూళ్లకు మధ్యవర్తులు
  • ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేల నుంచి రూ.10 వేలు వసూలు
  • వివాదాస్పద స్థలమైతే విలువను బట్టి ధర నిర్ణయం
  • ఏసీబీ దాడులతో బట్టబయలైన అక్రమాల పర్వం
  • నిజామాబాద్‌లో రూ.56,050 నగదు స్వాధీనం
  • సుమారు మూడున్నర గంటలు సోదా చేసిన ఏసీబీ
  • సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. చాలాచోట్ల కొందరు అధికారులు దళారులను ఏర్పాటు చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. పట్టా భూములతో కలిసున్న అసెన్డు, ప్రభుత్వ భూములతోపాటు వివిధ రకాలకు చెందిన స్థలాలను ఒక్కో రేటును ఫిక్స్‌ చేసి భారీగా వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో రెవెన్యూ కార్యాలయాల నుంచి అభ్యంతరాలున్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు అధికారికంగా పంపినప్పటికీ.. ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఫలితంగా అటవీ, రెవెన్యూ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సహకరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నిత్యకృత్యతంగా సాగే ఈ లావాదేవీలకు డాక్యుమెంట్‌ రైటర్లు (దస్తావేజు లేఖరులు) మ«ధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా.. బుధవారం నిజామాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై దాడులు జరపడంతో బండారం బట్టబయలైంది. మధ్యాహ్నం3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు దాడులు జరిపి అక్రమంగా ఉన్న రూ.56,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఇదే కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి అప్పటి జిల్లా రిజిస్ట్రార్‌ మోహన్‌ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టున్నారు.
    ‘కాగ్‌’లోనూ అక్షింతలు వేసిన వైనం
    నిజామాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. ఇందులో కొందరు డాక్యుమెంట్‌ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా నిజామాబాద్‌ రూరల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అధికారులు వారి పరిధిలోని ఓ వ్యాపార సముదాయాన్ని నివాస గృహంగా చూపుతూ రిజిస్ట్రేషన్‌ చేశారని ‘కాగ్‌’ తన నివేదికలో ఎత్తి చూపింది. దీంతో రూ.2.50 కోట్ల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని అక్షింతలు వేసింది. అలాగే నిజామాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో చాలా వరకు ప్రభుత్వ భూములను పట్టాదారుల సర్వేనంబర్లలో వేసి రిజిస్ట్రేషన్‌ చేశారన్న అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు అడ్డంగా దొరికిన రిజిస్ట్రేషన్స్, స్టాంపులశాఖ జిల్లా రిజిస్ట్రార్‌ కుర్మిల్ల మోహన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం కంకట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావు సాంగీని రూ.లక్ష డిమాండ్‌ చేసి.. రూ.60 వేలు లంచంగా తీసుకుంటుండగా 2015 సెప్టెంబర్‌ 4న ఏసీబీ డీఎస్‌పీ నరేందర్‌రెడ్డి వలపన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. జిల్లా రిజిస్ట్రార్‌ మోహన్‌ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కడంతో ఆయనపై క్రైం నంబర్‌ 14/ఆర్‌సీటీ–ఏసీబీ–ఎన్‌జడ్‌బీ/2015 అండర్‌ సెక్షన్‌ 7 ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్షన్‌ ఆక్ట్‌ 1988 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వినోద్‌ కె అగర్వాల్‌ జీవో ఆర్‌టీ నంబర్‌ 434/2015 సెప్టెంబర్‌ 5న సస్పెండ్‌ చేశారు. ఇంత జరిగినా నిజామాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అక్రమాలు ఆగడం లేదు. రోజు ఈ కార్యాలయంలో 30 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు మధ్యవర్తులు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. వివాదాస్పద స్థలమైతే ఆ భూమి విలువను బట్టి పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు కూడా ఆధారాలున్నాయి. రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత దళారులు సాయంత్రం 3 నుంచి 5 గంటల సమయంలో కార్యాలయంలోకి వెళ్లి అధికారులకు అప్పజెప్పడం పరిపాటి. ఇదే సమయంలో బుధవారం ఏసీబీ దాడులు చేసి రూ.56,050 నగదును స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    అక్రమార్జనపై సాగుతున్న విచారణ...
    జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంపై బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏసీబీ అధికారులు దాడి చేయడంతో బండారం బట్టబయలైంది. ఏసీబీ నిజామాబాద్‌ డీఎస్పీ నరేందర్‌రెడ్డి, మెదక్‌ జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. కార్యాలయంలోని 18 మంది బ్రోకర్లు, 8 మంది డాక్యూమెంట్‌ రైటర్‌ల వద్ద నుంచి రూ.56,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం పనుల్లో ఆన్‌లైన్‌ విధానం, చలానా రూపంలో చెల్లింపులు ఉండగా, నగదు ఎందుకు ఉందంటూ ఏసీబీ అధికారులు ప్ర«శ్నించారు. అక్కడ ఉన్న డాక్యుమెంట్‌ రైటర్‌లు, బ్రోకర్లను తనిఖీలు చేసి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పక్కన, డాక్యూమెంట్‌ రైటర్‌ల కార్యాలయాలు ఉన్నాయి. వీరు నిత్యం కార్యాలయంలోకి వెళ్లి ముడుపులు అందించి రిజిస్ట్రేషన్‌ పనులు చేయిస్తున్నారని ఏసీబీ అధికారుల పరీశీలన తేలింది. దీంతో ఏసీబీ ఆకస్మిక దాడి చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయం గేట్లువేసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారన్నారు. అక్రమంగా ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకోని వారి ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్‌లు చేçస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కార్యాలయంలో ఇద్దరు సబ్‌æ రిజిష్ట్రార్‌లు ఆనంద్, స్వామిదాస్, ఒక చిట్టి రిజిస్ట్రార్‌ రవీందర్‌లు సిబ్బంది ఉన్నారు. పూర్తి స్థాయిలో సోదాలు చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్టును, ఎవరి ప్రమేయం ఎంత ఉందో దానిపై సమగ్రంగా నివేధికను ప్రభుత్వానికి అందిస్తామని డీఎస్పీలు తెలిపారు. బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. ఈ తనీఖీల్లో.. ఇద్దరు సీఐలు రఘునాథన్, నవీన్‌లు, 15 మంది సిబ్బందిలు పాల్గోన్నారు.
మరిన్ని వార్తలు