ఒక్కరు ఫెయిలైనా ఇంటికి పంపిస్తా!

7 Feb, 2017 22:34 IST|Sakshi
ఒక్కరు ఫెయిలైనా ఇంటికి పంపిస్తా!

– ఎంఈఓ, హెచ్‌ఎంలకు కలెక్టర్‌ హెచ్చరిక
– జీతాల కోసం పని చేయొద్దని సూచన
– ర్యాంకులు తెస్తే టీవీల్లో వేయిస్తానని ప్రకటన

అనంతపురం టౌన్‌ : ‘పిల్లల భవిష్యత్‌ మీ చేతుల్లో ఉంది. జీతం కోసం కాకుండా బాధ్యతగా పని చేయండి. ఈసారి టెన్త్‌లో ఒక్కరు ఫెయిలైనా ఇంటికి పంపిస్తా’ అని కలెక్టర్‌ కోన శశిధర్‌ హెచ్చరించారు. మంగళవారం మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను హెచ్‌ఎంలు సవాలుగా తీసుకోవాలన్నారు. పదోతరగతి పాస్‌ కాకుంటే కనీసం సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా రాదన్నారు. జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేసే సమయంలో 20 పోస్టులుంటే పది వేల దరఖాస్తులు వస్తున్నాయన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని, సరైన విద్యాబోధన చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. కొందరు టీచర్ల పనితీరు చూస్తే ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. వాళ్లే ఇళ్ల వద్దకు వెళ్లి పిల్లలను స్కూల్స్‌కు తెస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇలా అందరూ ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

ప్రధానోపాధ్యాయులపై ఆగ్రహం :
    గతేడాది పదో తరగతి ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలల హెచ్‌ఎంలతో కలెక్టర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ములకనూరు స్కూల్‌లో 26 శాతం ఉత్తీర్ణత రావడాన్ని చూసి హెచ్‌ఎం వెంకటేశ్వరరావుపై మండిపడ్డారు. రెగ్యులర్‌ టీచర్లు లేరని, మ్యాథ్స్‌ టీచర్‌ లేరని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంటిసాకులు చెప్పొద్దన్నారు. ‘మీలాంటి వాళ్లు గవర్నమెంట్‌ సర్వీస్‌లో పనికిరారు..టీచర్‌గా జాయిన్‌ అయ్యి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరగకుంటే చర్యలు తీసుకుంటానని’ హెచ్చరించారు. కల్లూరు జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు వేదవతిపైనా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ పర్సంటేజ్‌ ఏంటిది.. అసలు మీరు స్కూల్‌కు వెళ్తున్నారా? లేదా? అని అసహనం వ్యక్తం చేశారు.  ఇద్దరు టీచర్లు ఉండడంతో ఉత్తీర్ణత తగ్గిందని చెప్పడంతో ‘అసలు ఇలాంటి స్కూళ్లు మనకు అవసరమా? మీలాంటి వాళ్ల వల్లే పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్తున్నారు’ అని మండిపడ్డారు.  ఇదే పాఠశాలలో మ్యాథ్స్‌లో అందరూ ఫెయిల్‌ కావడం, ఆ సబ్జెక్ట్‌ టీచర్‌ కూడా ప్రధానోపాధ్యాయురాలే కావడంతో మరింత మండిపడ్డారు. ‘నీ సబ్జెక్టుకే దిక్కులేదు. పాస్‌ గురించి మాట్లాడతావు’ అని అన్నారు. అంతలో ఎంఈఓను పైకిలేపి ‘ఆమెకు ఎగ్జాం పెట్టండి.. అసలు పాస్‌ అవుతుందో లేదో’ అని సూచించారు. ఇంత దారుణంగా ఫలితాలు ఉంటే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం, కుందుర్పిలోని స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో వారినీ మందలించారు.

ఎంఈఓల పనితీరుపై మండిపాటు :
    మండల విద్యాశాఖ అధికారుల పనితీరుపైనా కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంటే ఎంఈఓలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘నువ్వు నా గురించి చెప్పొద్దు.. నేను నీ గురించి చెప్పను’ అన్న కోణంలో విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. అందరూ బయోమెట్రిక్‌ వేస్తున్నారా? అని ప్రశ్నించారు. దొంగ అటెండెన్స్‌లతో కాలం వెళ్లదీస్తే ఉపేక్షించేది లేదన్నారు. అన్ని స్కూళ్లలో బయోమెట్రిక్‌ తప్పనిసరి అని చెప్పారు.

ర్యాంకులు తెండి.. టీవీల్లో వేయిస్తా :
ఈసారి టెన్త్‌లో మంచి ర్యాంకులు సాధిస్తే కార్పొరేట్‌ స్కూళ్లు ఇస్తున్న తరహాలో తానే టీవీల్లో యాడ్స్‌ వేయించి, ఫొటోలు కూడా పెట్టిస్తానని కలెక్టర్‌ అన్నారు. ‘ఇన్ని స్కూళ్లు.. ఇంత స్టాఫ్‌ ఉన్నారు.. రిజల్ట్స్‌ రాకుంటే ఎలా? బెస్ట్‌ టీచర్లున్నారు. అందరూ బాగా పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాల’ని సూచించారు. జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అందరూ సంకల్పంతో పని చేసి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. సమీక్షలో జేసీ–2 ఖాజామొహిద్దీన్, డీఈఓ లక్ష్మీనారాయణ, ఎస్‌ఎస్‌ఏ పీఓ దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు