కొత్త రేషన్‌కార్డులకు బ్రేక్‌

27 May, 2017 00:47 IST|Sakshi
కొత్త రేషన్‌కార్డులకు బ్రేక్‌

రెండు నెలల వరకు జారీ చేయొద్దని  కమిషనర్‌ ఆదేశాలు
రాయికల్‌ : ఆహారభద్రత కార్డులకు బ్రేక్‌ పడింది. రేషన్‌ కార్డులు, అంత్యోదయ కార్డుల మంజూరు నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ.ఆనంద్‌ అన్ని జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్‌ దుకాణాల్లో ఈపాస్‌ విధానం అమలయ్యే వరకు కొత్త కార్డులకు అనుమతివ్వొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడున్న కార్డుల్లో కొత్తగా ఎవరిని చేర్చడం, తొలగించడం లాంటివి చేయొద్దని తహసీల్దార్లు, మీసేవ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.  

రెండు నెలలు ఆగాల్సిందే...
ఈపాస్‌ (ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌ అసెస్‌ సర్వీసెస్‌) విధానం రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ప్రస్తుతం అమలవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలు పర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసమే సుమారు రెండునెలల పాటు కొత్త రేషన్‌కార్డుల జారీని నిలిపేసినట్లు తెలిసింది. ఈపాస్‌ విధానం అమలులోకి వస్తే ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.

లబ్ధిదారులు దుకాణాలకు వచ్చినప్పుడు డీలర్లు వేలిముద్రలు తీసుకుని సరుకులు పంపిణీ చేస్తారు. కార్డుపై ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వేలిముద్ర వేసి సరుకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్డుదారులు దుకాణాలకు రాకున్నా వచ్చినట్లు జాబితాలో చూపించి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వీటికి చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం ఈపాస్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు