అక్రమాలు ‘ఈరన్న’ కెరుక!

12 Dec, 2016 14:50 IST|Sakshi
అక్రమాలు ‘ఈరన్న’ కెరుక!
- ఉరుకుందలో భారీస్థాయి అవినీతి
- కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు
- అభివృద్ధి పనుల్లో చేతివాటం!
- హుండీలెక్కింపుపైనా విమర్శలు
- ఓ అధికారిపై ఆరోపణలు
 
కర్నూలు (న్యూసిటీ) ఉరుకుంద ఈరన్న..భక్తుల ఇలవేల్పు. నిత్యం వందల మంది స్వామిని దర్శించుకొని మొక్కుబడులు సమర్పించుకుంటారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈ క్షేత్రంలో అక్రమాలు మితిమీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఇష్టానుసారంగా చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. టెండర్లలో గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అనుకూలమైన కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టడం.. వారితో కుమ్మక్కై కమీషన్లు దండుకుంటున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ తంతులో ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.  
తలనీలాలకు మార్కెట్‌ తగ్గిందట..
 క్షేత్ర పరిధిలో తలనీలాల టెండరుకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ టెండరు ఏటా కోట్ల రూపాయలు పలుకుతుంది. అయితే ఏటేటా పెరగాల్సిన ధర ఈ ఏడాది తగ్గిపోవడం అనుమానాలకు తావిస్తోంది. తలనీలాల పోగు చేసుకునేందుకు గతేడాది మూడు టెండర్లు వచ్చాయి. అయితే ఈ ఏడాది సింగిల్‌ టెండరే వచ్చింది. ఆ టెండరును మల్లయ్య అనే వ్యక్తి తక్కువ ధరకు కైవసం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది దేవుని ఆదాయానికి రూ.81.99 లక్షలు గండి పడింది. ఈ విషయమై..ఆలయ అధికారిని ప్రశ్నిస్తే తలనీలాలకు మార్కెట్‌ విలువ తగ్గిందని చెప్పారు. అదే నిజమైతే జిల్లాలోని మిగతా ఆలయాల పరిస్థితి కూడా అలాగే ఉండాలి. కానీ బేతంచెర్ల మండలం మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తీసుకుంటే తలనీలాల టెండరు గత ఏడాది కంటే అధిక ధర పలకడం గమనార్హం. 
ఉరుకుందలో తలనీలాల టెండర్లు ఇలా..
    2014 రూ.2.22 కోట్లు
2015 రూ.2.55 కోట్లు
2016 రూ.1.73 కోట్లు
 
చలువ పందిళ్లదీ అదే దారి 
 ఏటా శ్రావణమాస పూజల సందర్భంగా క్షేత్రంలో భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన టెండరును ఆరేళ్లుగా కర్ణాటకలోని గంగావతికి చెందిన వ్యక్తికి అప్పగిస్తున్నారు. ధర్మకర్త మండలి లేకపోయినా 2015–16లో అతనితోనే చలువ పందిళ్లు వేయించారు. ధర్మకర్త మండలి మాజీ చైర్మన్‌కు సదరు కాంట్రాక్టర్‌ అనుకూలం కావడంతో ఆయనకే పని అప్పగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. గత శ్రావణమాసంలో రూ.21.2 లక్షలకు పనులు అప్పగించి..  సుమారు రూ.2 లక్షలకుపైగా కమీషన్‌ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 
హుండీ లెక్కింపులో కూడా..
క్షేత్రానికి సంబంధించి హుండీ లెక్కింపులో కూడా అవినీతి జరగుతున్నట్లు విమర్శలున్నాయి. శ్రావణమాసంలో 6 నుంచి 7 సార్లు, ఇతర మాసాల్లో నెలకు ఒక సారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తారు. హుండీని లెక్కించిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించడం సాధారణమై పోయిందనే ఆరోపణలున్నాయి. ఎంతకాదనుకున్నా హుండీ లెక్కించిన ప్రతిసారి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు స్వాహా చేసి ఎవరి వాటా వారు తీసుకుంటున్నారని, ఈ తతంగం క్షేత్రంలో ఐదేళ్లుగా సాగుతోందని ట్రస్టుబోర్డు మాజీ సభ్యుడు ఒకరు ఆరోపించారు. 
ఇతర అక్రమాలు..
- అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వ్యక్తితో ఆలయానికి సున్నం, పెయింటింగ్‌ వేయించారు. ఈయన ఆలయ అధికారికి చెందిన మనిషి. దీంతో ధర్మకర్త మండలికి చెప్పకుండానే రూ.5 లక్షలతో ఈ పని చేయించినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ పనిలో రూ 1.5 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి.
-  ప్రసాదం తయారీలో వినియోగిస్తున్న సరుకుల కొనుగోలు..వాటికి సంబంధించి బిల్లుల్లో గోల్‌మాల్‌​ జరుగుతున్నట్లు సమాచారం. సరుకుల కొనుగోలుకు టెండర్లు పిలవడం లేదు. 
- నిర్వహణ ఖర్చులంటూ..ఆలయ ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 
 
పారదర్శకంగా పనులు: మల్లికార్జున ప్రసాద్‌, ఆలయ ఈఓ
టెండర్లు పిలిచి క్షేత్రంలో అన్ని పనులను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎక్కడా అక్రమాలు జరగలేదు. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదరిస్తున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు.
 
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం : జి.చెన్నబసప్ప, ఆలయ చైర్మన్‌
దేవస్థానంలో అక్రమాలు జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోతాం. కార్యనిర్వణాధికారి భక్తులకు అందుబాటులో ఉండలేదన్నది వాస్తమే. ఆయన వారానికి ఒకసారి అనంతపురం నుంచి వచ్చిపోతుంటారు.
మరిన్ని వార్తలు